తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం అయ్యారు. దాదాపుగా అరగంట సేపు భేటీ జరిగింది. భేటీ తర్వాత పది అంశాలపై కేసీఆర్ ప్రధానికి వినతి పత్రం సమర్పించారని మీడియాకు తెలంగాణ అధికారులు సమాచరం ఇచ్చారు. పది అంశాలపైనా విడివిడిగా లేఖలు ఇచ్చారని.. ఒకే విజ్ఞాపనపత్రంలో ఇవ్వలేదని తెలిపారు. ఆ లేఖలను కూడా మీడియాకు ఫార్వార్డ్ చేశారు.
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఐపీఎస్ల కొరత తీవ్రంగా ఉందని.. వారి సంఖ్యను పెంచాలనేది కేసీఆర్ మొదటి డిమాండ్. అయితే ఈ విజ్ఞాపనపత్రంపై తేదీ ఒకటి అని ఉంది. ఇక తెలంగాణకు జవహర్ నవోదయ విద్యాలయాల మంజరు , ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రస్థానంలో ఉన్నందున టెక్స్ టైల్స్ రంగం కోసం ప్రత్యేకంగా రూ. వెయ్యి కోట్ల సాయం, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన ట్రైబల్ యూనివర్శిటీ, ఐఐఎం, ఐఐటీలను ఏర్పాటు చేయాలని కోరారు. ఎప్పట్నుంచో అడుగుతున్న ఇతర సమస్యలనూ ప్రస్తావించారు.
అయితే మోడీ – కేసీఆర్ భేటీలో రాజకీయాలేమీ చర్చకు వచ్చాయా లేదా అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. రెండు వైపులా ఈ అంశంపై చిన్న లీక్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు. అయితే రాజకీయాలు మాట్లాడకుండా ఉండే అవకాశమే లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎన్నికల వేడి పెరుగుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఇలాంటి సమయంలో కేసీఆర్ ఏదో ఓ వైపు చేరాల్సిన పరిస్థితి ఉంది. గతంలోలా ఫెడరల్ ఫ్రంట్ కు పరిస్థితులు అంత సానుకూలంగా లేవు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ కూడా ఓ పోర్స్గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య ప్రధానితో కేసీఆర్ భేటీలో చర్చకు వచ్చిన రాజకీయ అంశాలపై సహజంగానే ఆసక్తి ఏర్పడుతోంది. కానీ ఇప్పటికైతే వారి మధ్య ఎలాంటిరాజకీయాలు చర్చకు రాలేదని చెప్పుకోవాలి.