డీజీపీ గౌతం సవాంగ్ రాజకీయ కారణాలతో తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. చింతమనేని ప్రభాకర్‌పై 84 కేసులు ఉన్నాయని పోలీసు శాఖ ఉపయోగించే ఎంటర్ప్రైజెస్ సెర్చ్‌లో చింతమనేని ప్రభాకర్ పేరు కొట్టి కేసుల జాబితాను బయటకు తీశారు. అదే సమయంలో వనజాక్షి కేసు విషయంలో రాజకీయపరమైన విమర్శలు కూడా చేశారు. డీజీపీ తనపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు చింతమనేని ప్రభాకర్ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టారు.
ఎంటర్ప్రైజెస్ సెర్చ్‌లో ముఖ్యమంత్రి జగన్ పేరును కొడితే 36 కేసులు వస్తాయని చింతమనేని వ్యాఖ్యానించారు. తనపై కేసుల విషయంలో డీజీపీ తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు. తనపై ఉన్న కేసులన్నీ ప్రజల కోసం పోరాడినవేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా చేసిన నేరాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. దోపిడీలు, దొంగతనాలు, అవినీతి కేసులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రజల కోసం చేసిన పోరాటంలోనే తనపై రాజకీయ కుట్ర పన్ని కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రతీ దాంట్లోనూ అట్రాసిటీ కేసులు పెట్టారని విమర్శించారు. . తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా తనపై ఉన్న రౌడీ షీట్‌ను ఎత్తి వేయించుకోవాలని ప్రయత్నం చేయలేదని గుర్తు చేశారు. తాను తప్పు చేయలేదని… ఆ విషయం న్యాయస్థానాల్లో నిరూపించుకోగలన్నారు.
సినిమా చూపించడంతో ఆర్జీవీని గౌతం సవాంగ్ మించిపోయారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులతో తనకు ప్రాణహాని ఉందని చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. చింతపల్లిలో తనతో పోలీసులు వ్యవహరించిన తీరుతో తనకు ఆ రోజే ఆఖరు అనుకున్నాన్నారు. తనకు కేంద్ర బలగాలతో రక్షణకావాలని.. సీఆర్పీఎఫ్తో రక్షణ కోసం తాను కోర్టుకెళ్తానని ప్రకటించారు. డీజీపీ స్థానంలో ఉండి రాజకీయ పరమైన విమర్శలు చేయడంతో సవాంగ్‌కు కూడా రాజకీయపరమైన కౌంటర్లు ఎదురవుతున్నాయి. ఇది పోలీసు శాఖ ఇమేజ్‌పై మచ్చపడేలా చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.