రెండు రోజుల వ్యవధిలో ఢిల్లీలో కేసీఆర్ ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిశారు. ఇద్దరికీ ప్రధానంగా తెలంగాణలో పోలీస్ వ్యవస్థ సంస్కరణ గురించి.. కొత్త ఐపీఎస్ పోస్టుల గురించి వినతి పత్రాలు ఇచ్చారని అధికారంగా తేల్చారు. ప్రస్తుతం తెలంగాణకు 139 మంది ఐపీఎస్ అధికారుల కేటాయింపు ఉంది. ఈ సంఖ్యను 195కు పెంచాలని కోరారు. తెలంగాణ పోలీస్ క్యాడర్లో చేయాల్సిన మార్పుల గురించి లేఖను మోడీకి.. హోంమంత్రికి కూడా ఇచ్చారు.
అయితే బీజేపీ ఇద్దరు అగ్రనేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ రాజకీయాలు చర్చించలేదా అన్నదానిపై మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇరువురి మధ్య భేటీల్లోనూ రాజకీయాలు కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రధానితో పాటు అమిత్ షాతో భేటీలో పెద్దగా తెలంగాణకు చెందిన అధికారులెవరూ లేరు. ప్రధానమంత్రి నరేంద్రమోడీతోనూ కేసీఆర్ ముఖాముఖి చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. అమిత్ షాతోనూ ఆయన ఏకాంతంగా మాట్లాడినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ రాజకీయాల గురించి ప్రస్తావన వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తొమ్మిది నెలల కిందట ప్రధానమంత్రితో భేటీ అవక ముందు కేసీఆర్ రాజకీయం వేరుగా ఉండేది. బీజేపీపై యుద్ధం ప్రకటించారు. కానీ ఆ తర్వతా తర్వాత కేసీఆర్ బీజేపీతో సాఫ్ట్‌గా రాజకీయం చేస్తున్నారు. రణం లేదు రాజీ లేదని ప్రకటించారు. ఇక ముందుకూడా అదే పద్దతి కొనసాగించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు బీజేపీ రాజకీయ వ్యూహాలకు ఆయన కీలక వనరుగా ఉపయోగపడే అవకాశం ఉందంటున్నారు. మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్ పార్టీతో ఇతర పార్టీలు కలవకుండా కొత్త కూటమి ప్రయత్నాలను కేసీఆర్ చేయవచ్చని.. దానికి బీజేపీ అగ్రనేతల ఆశీస్సులు అందిస్తారన్న ప్రచారం మాత్రం ఢిల్లీలో సాగుతోంది. కేసీఆర్ వ్యూహాలేమిటో ఆయన నిర్ణయాలు తీసుకునే వరకూ అర్థం చేసుకోవడం కష్టం.