దేశంలో పెట్రోరేట్లది చాలా పెద్ద సమస్య. ఎక్కడికి వెళ్లినా బీజేపీ ప్రజాప్రతినిధులకు ఇదే సవాల్. అందుకే వారు రెడీమేడ్ ఆన్సర్లను వెదుక్కుంటూ ఉంటారు. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ఒకరు దీనికి తాలిబన్లను కారణంగా చెప్పారు. కొందరు చెబుతున్నట్లుగా దేశంలో ఉన్న తాలిబన్ల గురించి కాదు ఆయన చెప్పింది నిజంగా తాలిబన్ల గురించే. అక్కడ వారు ఆఫ్గన్‌ను ఆక్రమించుకోవడం వల్ల సరఫరా అగిపోయిందని అందుకే పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయని అంటున్నారు. ఆ కర్ణాటక ఎమ్మెల్యే పేరు అరవింద్ బెల్లాడ్.
ఆయన తాలిబన్లను కారణంగా చెప్పి ఆగిపోతే బాగుండేది కానీ ఆయన ఈ విషయం తెలిసని చదువురాని వాళ్లు ఓటర్లు అన్నట్లుగా వ్యాఖ్యలు చేయడంతోనే దుమారం రేగుతోంది. ” అప్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. అందు వల్ల ముడి చమురు సరఫరా తగ్గిపోయిందని తెలుసు. అందుకే ఎల్‌పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని తేల్చేశారు. ఓటర్లుకు ఈ అంతర్జాతీయ పరిణామాల గురించి అర్థం చేసుకునేంత జ్ఞానం లేదు. ఊరికే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు’ అని ఆయన తెగ బాధపడిపోయారు.
బీజేపీ నేతలంతా వాట్సాప్ యూనివర్శిటీ ప్రొఫెసర్లే అని అరవింద్ లాంటివాళ్లు తరచూ నిరూపిస్తూంటారు. పైగా ప్రజలకు ఏమీ తెలియదని దబాయింపులు కూడా. అసలు ఆప్ఘనిస్థాన్ నుంచి ఇండియాకు చమురు సరఫరానే లేదు. భారత్ ఇరాక్, సౌదీ అరేబియా, యూనైటెడ్ అరబ్ ఎమిరెట్స్, నైజిరియా, అమెరికా, కెనడాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది. ఒక్క చుక్క కూడా ఆఫ్ఘన్ నుంచి రాదు. అయినా అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల సంక్షోభానికి ముడి పెట్టడం అదీ కూడా ప్రజలకేమీ తెలియదని నిందించే ఘరానా శైలీ బీజేపీ నేతలకు మాత్రమే ఉంటుంది.