ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలు తమ ఎన్నికల్లో పరిస్థితులు బాగున్నాయని ఎన్నికలు పెట్టాల్సిందేనని స్పష్టం చేశాయి. ఆ మేరకు ఈసీ కూడా ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అయితే గత నాలుగైదు నెలల నుంచి రాజకీయంగా హోరెత్తిపోతున్న హుజురబాద్లో మాత్రం ఎన్నికలు జరగడం లేదు. దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలకు అనుకూలమైన వాతావరణం లేదని నివేదిక పంపడమే. పండుగల సీజన్ అయిపోయిన తర్వాత ఎన్నికలు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దానికి ఈసీ అంగీకరించి వాయిదా వేసింది. ఎన్నికలకు సిద్ధమైన కేసీఆర్ .. ఇప్పుడు వాయిదా ఎందుకు కోరారన్న చర్చ రాజకీయ పార్టీల్లోనూ ప్రారంభమయింది. సామాన్యుల్లోనూ అదే అనుమానం.
కేసీఆర్ హుజురాబాద్ విషయంలో చాలా ఎక్కువ దృష్టి పెట్టడం.. వేల కోట్లు పంటడానికి వెనుకాడక పోతూండటం.. ఆ నియోజకవర్గానికి చెందిన నేతలకు హుటాబుటిన పదవులు కట్టబెడుతూండటంతో అక్కడంత సులువుగా లేదన్న అభిప్రాయం బలపడుతోంది. ఎంత చేసినా ఈటలే గెలుస్తారన్న ఓ ప్రచారం మాత్రం జన బాహుళ్యంలోకి వెళ్లిపోయింది. దీనికి కారణం ఈటల నిన్నామొన్నటి వరకూ టీఆర్ఎస్ ముఖ్యనేత. ఆయనను బయటకు పంపిన కారణంపై ప్రజల్లో అభ్యంతరాలున్నాయి. అదే సమయంలో ఉద్యమ సమాజంలో ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన చేరిన పార్టీపై అభ్యంతరాలున్నా అక్కడ పార్టీప్రస్తావన రావడం లేదు. ఈటలకు మద్దతా వద్దా అన్న అంశంపై చర్చ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల నడుమ తాడో పేడో తేల్చుకని విజయం సాధించి తిరుగులేని నిరూపించుకుంటారని అనుకున్నారు. కానీ కేసీఆర్ వాయిదాకే మొగ్గు చూపారు.
హుజురాబాద్లో టీఆర్ఎస్ పరిస్థితి బాగోలేదని ఇప్పటి వరకూ అంతర్గత ప్రచారం జరగడానికి కారణం టీఆర్ఎస్ అధినేత దూకుడుగా తీసుకున్న నిర్ణయాలే. ఇప్పుడు ఆ ప్రచారం మరింతగా పెరడానికి కూడా ప్రభుత్వం ఉపఎన్నికను వాయిదా కోరడం కారణం అవుతుంది. ఇవన్నీ టీఆర్ఎస్ అధినేత వ్యూహాత్మక తప్పిదాలేనంటున్నారు. ఓటమి భయంతోనే ఉపఎన్నికలను వాయిదా వేయించారని ఇప్పటికే బీజేపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. ఈ విమర్శలను డిఫెండ్ చేసుకోవడం టీఆర్ఎస్కు కాస్త కష్టమే.