విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజనపై ఒక్క విజయసాయిరెడ్డి మినహా మరే వైసీపీ నేతలకూ సదభిప్రాయం లేకుండా పోయింది. ఆమె విజయసాయిరెడ్డి ఆదేశాలను మాత్రమే పాటిస్తూ ఇతర విషయాల్లో నిక్కచ్చిగా ఉంటున్నారేమో కానీ.. వారంతా తమకు ఊపిరి ఆడటం లేదని ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకుని సృజనపై ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా ఇలా వైసీపీ చిన్నా.. పెద్దా నేతలందరూ సమావేశం పెట్టుకుని తీర్మానం చేసి విజయసాయిరెడ్డికి ఫిర్యాదు చేశారు. విశాఖ ఇంచార్జి మంత్రి కన్నబాబు, జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్లకూ ఫిర్యాదులు పంపారు. నిజానికి కన్నబాబుకు విశాఖ కమిషనర్‌పై ప్రత్యేక మైన అభిప్రాయం లేదు కానీ.. అవంతి శ్రీనివాస్‌కు కూడా అభ్యంతరాలు ఉన్నాయని చెబుతున్నారు.
అయితే విజయసాయిరెడ్డి ప్రత్యేకమైన ఆసక్తితో సృజనను కమిషనర్ పోస్టులో ఉంచారు. ఆమెను బదిలీ చేయాల్సిన పరిస్థితి ఉన్నా… విజయసాయిరెడ్డి పట్టుబట్టి అక్కడే ఉంచారన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే విధి నిర్వహణలో ఆమె కాస్త కటువుగానే ఉంటారన్న ప్రచారం ఉంది. విజయసాయిరెడ్డి ప్రమేయం ఉన్న కూల్చివేతల విషయంలో చూసీ చూడనట్లుగా ఉన్నా.. ఇతర ఆక్రమణలు.. అక్రమ కట్టడాల విషయంలో మాత్రం ఆమె సీరియస్‌గా నే ఉంటారని చెబుతున్నారు. ఇది వైసీపీ నేతలకు ఏ మాత్రం మింగుడుపడటం లేదు.
తమ ప్రభుత్వం వచ్చినా తమకు సాయంగా ఆమె నిర్ణయాలు ఉండటం లేదని వారు ఫీలవుతున్నట్లుగా ఉన్నారు. అందుకే అందరూ సామూహిరంగా ఫిర్యాదులు చేశారు. వారి లక్ష్యం ఆమెను బదిలీ చేయించడమే. అందుకే ఆమె కూడా తాను ఎవరికీ భయపడకుండా పని చేస్తాని.. తనకు శిక్షణలో అదే నేర్పారని ట్వీట్లు చేస్తున్నారు. మొత్తానికి విశాఖలో వైసీపీ వర్సెస్ వైసీపీ కాక మీద ఉంది. మధ్యలో కమిషనర్ సృజన బదిలీ అవుతారా లేదా తన సిన్సియార్టీదే గెలుపని నిరూపించుకుంటారో చూడాలి.