సెకండ్ వేవ్ తరవాత థియేటర్లు మళ్లీ తెరచుకున్నాయి. వరుసగా సినిమాలొస్తున్నాయి. అయితే… ఓటీటీ నుంచి వెండి తెరకు పొంచి ఉన్న ప్రమాదం మాత్రం తప్పలేదు. భారీ – మీడియం రేంజు సినిమాల్ని థియేటర్లలో విడుదల చేసే సాహసం నిర్మాతలు చేయడం లేదు. సినిమాలు రిలీజ్ అవుతున్నా – వసూళ్లు రాబట్టలేకపోవడమే ఇందుకు కారణం. ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఇంకా భయపడుతూనే ఉన్నారని ఈమధ్య వచ్చిన సినిమాల వసూళ్లు నిరూపించాయి. అందుకే… నిర్మాతలు ఇంకా ధైర్యం చేయలేకపోతున్నారు. టక్ జగదీష్ ఓటీటీకి వెళ్లిపోవడానికి కారణం ఇదే. ఈ వారమే టక్ జగదీష్ విడుదల కానుంది. అయితే అదే రోజున.. థియేటర్లో సిటీమార్ సందడి చేయబోతోంది. ఈవారం విడుదలయ్యే ప్రధాన సినిమాలివే. ఓరకంగా ఈ రెండు సినిమాల మధ్య పోటీ కంటే.. థియేటర్ ఓటీటీ మధ్య పోటీ అనడమే సమంజసం.
నాని కథానాయకుడిగా నటించిన చిత్రం టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకుడు. ఈనెల 10న అమేజాన్ లో వస్తోంది. నాని సినిమా అంటే కుటుంబ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. తను ఫ్యామిలీ హీరో. పైగా టక్ జగదీష్ ఓ కుటుంబ కథా చిత్రం. అన్ని విధాలా ఇది థియేటర్ సినిమానే. కాకపోతే… పరిస్థితులు బాగోకపోవడం వల్ల ఓటీటీకి ఇవ్వాల్సివచ్చింది. వినాయక చవితిన ఈ సినిమా ఓటీటీలో విడుదల అవ్వడం వల్ల… పండగ వాతావరణం రెట్టింపు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఓటీటీలో ఈ సినిమా ఎంత మంది చూశారు? అనే రికార్డులేం బయటకు రావు గానీ, కచ్చితంగా ఆ రోజు కుటుంబ ప్రేక్షకులు `టక్ జగదీష్` చూడ్డానికి మొగ్గు చూపుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అదే రోజున గోపీచంద్ సిటీమార్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంపత్ నంది దర్శకుడు. తమన్నా కథానాయిక. కబడ్డీ నేపథ్యంలో సాగే కథ ఇది. ట్రైలర్లు, పాటలు ఆకట్టుకుంటున్నాయి. మంచి మాస్ సినిమా పడితే గానీ, ప్రేక్షకులు థియేటర్లకు కదిలి రారు… అని అనుకుంటున్న ఈ నేపథ్యంలో సిటీమార్ ఎలాంటి ప్రభావం చూపించబోతోందన్న ఆసక్తి కలుగుతోంది. సిటీమార్ కి మంచి ఓపెనింగ్స్ వస్తే గనుక… మీడియం రేంజు సినిమాలకు ఊతం ఇచ్చినట్టే అవుతుంది.