నిరుద్యోగ దీక్షల పేరుతో ప్రతి మంగళవారం ఒక్కో చోట దీక్ష చేస్తున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇప్పుడు దళిత ఎజెండాను కూడా భుజానకెత్తుకోవాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ దళిత ఎజెండాను ఎంచుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే పూర్తి స్థాయిలో దళిత వాదం వినిపిస్తున్నారు. పోటీగా కాంగ్రెస్ దళిత, గిరిజన దండోరా సభలతో ప్రజల ముందుకు వెళ్తోంది. దీంతో దళితులను ఆకట్టుకోవడంతో తాము వెనుకబడిపోతామన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా దళిత పోరాటాలు ప్రారంభించారు.
సెప్టెంబర్ 12వ తేదీన ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలకేంద్రంలో “వైఎస్ఆర్ దళిత భేరి” బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. కేసీఆర్ రాజకీయ లబ్ది కోసమే దళితుల్నివాడుకుంటున్నారని షర్మిల ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా దళితులకు మూడెకరాల భూమి, దళితబంధుతో కలిపి ప్రతి దళిత కుటుంబానికి రూ.50 లక్షలు చెల్లించాలనేది షర్మిల పార్టీ ప్రధాన డిమాండ్.
తుంగతుర్తి సభ తర్వాత రిజర్వుడు నియోజకవర్గాలన్నింటిలోనూ సభలు పెట్టాలన్న ఆలోచనలో వైఎస్ఆర్టీపీ ఉంది. తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ దళితులను ఆకట్టుకోవడానికి పథకాలు.. పోరాటాలు చేస్తూండటంతో ఇక నుంచి దళిత వాదమే తెలంగాణలో వినిపించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వైఎస్ అభిమానులందర్నీ ఏకం చేసేందుకు షర్మిల తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత వరకు నిరాశే ఎదురవుతున్నా ఆమె ఎక్కడా వెనక్కి తగ్గాలని అనుకోవడం లేదు.