ఆంధ్రప్రదేశ్లో సామాజిక పెన్షన్ల లబ్దిదారులను తగ్గించడం వివాదం అవుతోంది. తమ పెన్షన్లు తీసేశారంటూ వృద్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ అవుతున్నాయి. మరో వైపు విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం అనర్హులకు కూడా పెన్షన్లు ఇవ్వాలా అని ప్రశ్నిస్తోంది. అంటే తొలగిస్తున్నామని ఒప్పుకుంటోంది. అనర్హులైతే ఇప్పటి వరకూ ఎందుకిచ్చారనే ప్రశ్న అంతటా వినిపిస్తోంది.
సామాజిక పెన్షన్లు దాదాపుగా ఏ ఆధారం లేని వారికే ఇస్తారు. లబ్దిదారుల సంఖ్య 60 లక్షల వరకూ సగటున ఉంటోంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ప్రతి నెలా యాభై వేల వరకూ సామాజిక పెన్షన్ల లబ్దిదారులు తగ్గిపోతున్నారు. జూన్ నెలలో గరిష్టం 61 లక్షల 46వేల మందికి పెన్షన్ పంపిణీ చేశారు. జూలై నెలలో ఈ సంఖ్య 60 లక్షల95 వేల మందికి తగ్గిపోయింది. ఆ తర్వాత నెల అంటే ఆగస్టులో 60 లక్షల 50వేల మందికే పంపిణీ చేశారు. ఈ నెల పెన్షన్లకు అర్హుల సంఖ్య 59 లక్షల 18వేలుగా మాత్రమే గుర్తించారు. మిగిలిన వారందరికీ పెన్షన్ తీసేశారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం వివిధ రకాల నిబంధనలను అమలు చేయాలని వాలంటీర్లను ఆదేశించింది. ఒక ఇంట్లో ఒకరికే పెన్షన్,రేషన్ కార్డులో ఇద్దరి పేర్లు ఉండటం, కుటుబంంలో ఎవరికైనా ఉద్యోగం ఉండటం వంటి పలు నిబంధనలు తీసుకు రావడంతో ఇప్పటి వరకూ పెన్షన్ తీసుకున్న వారందరూ అనర్హులవుతున్నారు. దీంతో అనేక మంది వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ల వయసు 60కి తగ్గించి రూ. మూడు వేల వరకూ పెంచుకుంటూ పోతామన్నారు. ప్రమాణస్వీకారం చేసేటప్పుడు ప్రతీ ఏడాది రూ. 250 పెంచుతామన్నారు. కానీ రెండున్నరేళ్లు గడుస్తున్నా ఒక్క సారే పెంచారు. వచ్చే జనవరి నుంచి పెంచుతామని సంక్షేమ క్యాలెండర్లో ప్రకటించారు. రూ. 250 పెంచాలంటే ప్రభుత్వం వద్ద నిధులు సరిపోవు. అందుకే లబ్దిదారులను తగ్గించి ఆ మిగిలిన వాటితో ఇతరులకు పెన్షన్ పెంచుతారన్న అభిప్రాయం వినిపిస్తోంది.