తెలంగాణ సీఎం కేసీఆర్ వారం రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. పార్టీ కార్యాలయ శంకుస్థాపన కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన ఆ పని అయిన తరవాత ప్రధానమంత్రి, హోంమంత్రితో పాటు ఇతర కీలక శాఖల మంత్రుల్ని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై నివేదికలు విజ్ఞపనపత్రాలు సమర్పించారు. అందులో ప్రస్తుతానికి తెలంగాణకు అత్యంత కీలకం అయిన నీటి వివాదాల పరిష్కారానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇక భేటీలన్నీ పూర్తయ్యాయి.. కేసీఆర్ తిరిగి వస్తారని అనుకుంటున్నసమయంలో ముఖ్యమత్రి జగన్ ఢిల్లీ బయలుదేరబోతున్నారన్న ప్రచారం ఊపందుకంది.
సీఎంవో అధికారులు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. వారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డిఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. కేసీఆర్ రాష్ట్రంతో సంబంధం ఉన్న పలు అంశాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారని ప్రచారం జరుగుతున్నందున.. ఆ విషయంలో తమ వాదన వినిపించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో ఏపీ ప్రయోజనాలను కాపాడకపోతే రాయలసీమతో పాటు డెల్టా రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన భావిస్తున్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిలిపివేయడంతో పాటు సీమ ఎత్తిపోతలకు అనుమతులు తెచ్చుకోవడం ఇప్పుడు సీఎం జగన్కు అత్యంత కీలకంగా మారింది. ఈ క్రమంలో ప్రధాని, హోంమంత్రిలతో సమావేశం కావాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా భావిస్తున్నారు. వారి అపాయింట్మెంట్ ఖరారును బట్టి జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.