అప్పులు దొరక్కపోతే బండి నడిచే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వ పెద్దలు అప్పుల పరిమితి పెంచుకో వడానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కేంద్రం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది తీసుకోవాల్సిన రుణాల పరిమితి ముగిసిపోయింది. రూ. వెయ్యి కోట్లు మాత్రమే పెండింగ్ ఉంటే దాన్ని గత వారం తీసేసుకున్నారు. ఆ తర్వాత పరిమితి పెంపు కోసం బుగ్గున రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో మకాం వేశారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో అదే పనిగా సమావేశమయ్యారు. రాజకీయంగానూ తమ వంతు ప్రయత్నాలు చేశారు. వారి కృషి ఫలించింది. కేంద్రం చల్లని చూపు చూసింది.
ఏపీ డిసెంబర్ వరకూ మరో రూ. 10500 కోట్ల అప్పును తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చామంటూ రిజర్వ్ బ్యాంక్‌కు సమాచారం పంపింది. సోమవారమే ఈ సమాచారం అర్బీఐకి చేరినట్లుగా తెలియగానే వెంటనే ఏపీ ప్రభుత్వం మంగళవారం రిజర్వ్ బ్యాంకులో బాండ్లు అమ్మకానికి పెట్టేసింది. 18 ఏళ్లకు రూ. వెయ్యి కోట్లు.. 20 ఏళ్లకు రూ. వెయ్యి కోట్లు అప్పు తెచ్చుకునేందుకు ఇండెంట్ పెట్టింది. దీంతో ఈ నెల గండం గట్టెక్కడానికి అవకాశం ఏర్పడింది. అప్పుల విషయంలో కేంద్రం కాస్త టెన్షన్ పెడుతున్నా.. చివరికి సహకరిస్తూండటంతో ఏపీ ప్రభుత్వంలోనూ కాస్త ధీమా ఉంది.
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. అప్పుల కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాదని.. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా చేతులెత్తేసే అవకాశం ఉండదన్న అంచనాలో ఉన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రధానమైన టాస్క్ అప్పులకు అనుమతులు సాధించడమే. ఆ పనిని ఆయన సమర్థంగా నిర్వహిస్తున్నారు. నెలలో పదిహేను రోజుల వరకూ ఢిల్లీలో ఉంటున్నప్పటికీ.. ప్రభుత్వ ఆర్థిక కష్టాలు మాత్రం తీర్చేస్తున్నారు.