విశాఖలో వైసీపీ ముఖ్య నేతగా చెలామణి అవుతున్న మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్ ప్రసాద్‌ను ఒరిస్సా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆర్థిక నేరాలకు సంబంధించి 2019లో మళ్ల విజయప్రసాద్‌పై ఒరిస్సాలో కేసు నమోదైంది. ఆయన వేల్ఫేర్ గ్రూప్ పేరుతో కంపెనీలను నిర్వహించేవారు. అందులో చిట్ ఫండ్ కంపెనీ కూడా ఉంది. నమ్మకానికి అమ్మ వంటిది అని తన కంపెనీకి ట్యాగ్ లైన్ పెట్టి పెద్ద ఎత్తున చిట్స్ నిర్వహించారు. అలా ఒడిషాలోనూ నిర్వహించారు.
చిట్స్, డిపాజిట్లు సేకరించి చివరికి జెండా ఎత్తేశారు. ఈ అంశంపై ఒరిస్సాలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా మళ్ల విజయప్రసాద్‌ను ఒడిశా సీఐడీ, నేరవిభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మళ్ల విజయప్రసాద్‌ను విశాఖ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ అనుమతితో విజయప్రసాద్‌ను ఒరిస్సా తీసుకెళ్లారు. వైసీపీ ప్రభుత్వం ఆయనకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇచ్చింది. రాష్ట్ర విద్యారంగ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ముళ్ల విజయప్రసాద్ ఉన్నారు.
వేల్ఫేర్ గ్రూప్ కంపెనీపై చాలా ఆరోపణలు ఉన్నాయి. వేల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రజల వద్ద నుంచి దాదాపుగా రూ. 1500 కోట్లు డిపాజిట్లుగా వసూలు చేశారు. సీబీఐ కూడా కేసు పెట్టింది. ఆ కేసు విచారణలో ఉంది. ఏపీలో కంటే ఎక్కువగా చత్తీస్ ఘడ్, జార్ఘండ్, ఒడిషా లాంటి రాష్ట్రాల్లో మరుమూల ప్రాంతాల్లో డిపాజిట్లు సేకరించారు. తర్వాత సీబీఐ కేసు పేరుతో ఇప్పుడు దాదాపుగా.. వ్యాపారాలను ఆపేశారు. డిపాజిటర్లకు చెల్లింపులు నిలిపివేశారు.