22వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కోర్టుకు హాజరవ్వాల్సి ఉన్న సీఎం జగన్ ఆరో తేదీనే కోర్టులో పిటిషన్ వేశారు. అధికారిక కార్యక్రమాల రీత్యా తాను కోర్టుకు హాజరు కాలేనని తన తరపున లాయర్ హాజరవుతారని సంపూర్ణంగా సహకరిస్తారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వాన్‌పిక్, లేపాక్షి కేసుల్లో చార్జిషీట్లను ఇటీవలఈడీ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. 22వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వాన్‌పిక్ కేసులో కేసులో ప్రధాన నిందితుడుగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏ -2 గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. ఇతర నిందితులుగా మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణా రావు, నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాష్, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుతో పాటు పలువురు సివిల్ సర్వీస్ అధికారులు ఉన్నారు. జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టిన 12 కంపెనీలకు కూడా ఈడీ కోర్టు నోటీసులు జారీ చేసింది.
లేపాక్షి కేసులోనూ ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుని నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో జగన్, విజయసాయిరెడ్డిలతో పాటు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గీతారెడ్డిలకు కూడా నోటీసులు జారీ చేసింది. పారిశ్రామికవేత్త శ్యాంప్రసాద్ రెడ్డి, ఐఏఎస్ అధికారి మురళీధర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య కూడా నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 22వ తేదీన కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. వాన్‌పిక్, లేపాక్షి కేసుల్లో క్విడ్ ప్రో కో వ్యవహారంలో అక్రమ నగదు లావాదేవీలకు పాల్పడినట్లుగా ఈడీ కేసులు నమోదు చేసింది.
క్విడ్ ప్రో కో తరహాలో జగన్ సంస్థలు పెట్టుబడులు సేకరించాయని వీటిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ కూడా కేసులు నమోదు చేసి చార్జిషీట్లు దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ దూకుడు మీద ఉంది. ఇటీవల సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులను విచారించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని విజయసాయిరెడ్డి విచారణ ప్రారంభం కాకుండా వాయిదాలు కోరుతున్నారు.