నాని సినిమా అంటే ఎంటర్ టైన్మెంట్ కోరుకుంటారు. కానీ ‘టక్ జగదీష్’ ట్రైలర్ చూస్తే అంతా సీరియస్ ఎమోషన్లతో సాగింది. నాని టైపు వినోదం లేదా? అనే ప్రశ్నలు అనుమానాలూ మొదలయ్యాయి. వీటిపై… శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు. నాలుగు జోకులు కట్ చేసి, అవన్నీ ట్రైలర్లో పెట్టేసి, జనాల్ని వేరే ఊహల్లో వదిలేయడం తనకు ఇష్టం లేదని చెబుతున్నాడు శివ.
”సినిమాలో ఏముందో ట్రైలర్లో కూడా అదే ఉండాలనుకుంటాను. సినిమాలో ఉన్న నాలులు జోకులూ, నాలుగు యాక్షన్ సీన్లూ ట్రైలర్లో పెట్టేసి తీరా సినిమా చూశాక ప్రేక్షకులు ఇలా ఉందేంటి? అని అనుకోకూడదు. నాని తరహా కామెడీ ఉంటుంది. అయితే కథ దాని కోసం కాదు కదా..” అని క్లారిటీ ఇచ్చారు.
”నాక్కూడా పడీ పడీ నవ్వించే కథలు రాయాలని ఉంటుంది. దర్శకులంతా అన్ని రకాల ఎమోషన్లు తీయాలనుకుంటారు. శుభ సంకల్పం సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమా చూసి ఓ రకమైన ట్రాన్స్‌లోకి వెళ్లిపోయా. అలాంటి ఎమోషన్ చూపించాలనుకుంటాను. ఈ సినిమాచూశాక అలాంటి ఓ ఫీల్ వస్తుంది. నానికి కేవలం 10 నిమిషాల్లోనే కథ చెప్పా. తనకు ఇది వేరే జోనర్. నేను ప్రేమకథ చెబితే రిజెక్ట్ చేద్దామని ఆయన ఎదురు చూస్తున్నారు. పూర్తిగా కొత్త సెటప్ తో కథ చెప్పేసరికి ఎగ్జైట్ అయ్యారు. టక్ జగదీష్ లాంటి కథని మళ్లీ నేనే రాయలేనేమో” అన్నారు. ఈనెల 10న ఈ సినిమా అమేజాన్ ప్రైమ్‌లో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.