వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు మూడో వ్యక్తి వాంగ్మూలం నమోదు చేశారు. ఆయన పేరు కృష్ణమాచారి. అనంతపురం జిల్లా కదిరికి చెందిన వ్యాపారి. ఆయన హార్డ్ వేర్ దుకాణం నిర్వహిస్తూ ఉంటారు. గతంలో కూడా ఆయనను సీబీఐ అధికారులు చాలా సార్లు పిలిచి ప్రశ్నించారు. ఇప్పుడు ఆయనతో ప్రొద్దుటూరు కోర్టులో వాంగ్మూలం ఇప్పించారు. ఇప్పటికే వాచ్మెన్ రంగయ్య, మాజీ డ్రైవర్ దస్తగిరిలతో ఈ వాంగ్మూలాలు నమోదు చేయించారు. ఇప్పుడు కృష్ణమాచారితో నమోదు చేయించారు. వివేకానందరెడ్డి హత్యకు వాడిన ఆయుధాలను కృష్ణమాచారి దుకాణంలోనే కొనుగోలు చేశారన్న అనుమానాలున్నాయి.
అందుకే ఆయనను సీబీఐ అధికారులు చాలారోజులుగా ప్రశ్నించి ఎవరు కొనుగోలు చేశారో.. కనిపెట్టే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఖచ్చితమైన వివరాలు చెబుతున్నారన్న నమ్మకం కలిగిన తర్వాత కోర్టులో వాంగ్మూలం ఇప్పించారని తెలుస్తోంది. సీబీఐ అధికారులు పులివెందులలో విచారణ ప్రారంభించి మూడు నెలలు అవుతోంది. కడప జైలు గెస్ట్ హౌస్, పులివెందుల గెస్ హౌస్‌లోనే వారి మకాం కొనసాగుతోంది. ప్రశ్నించిన వారినేప్రశ్నిస్తున్నారు. ఒక్క సునీల్ యాదవ్ ను మాత్రం అరెస్ట్ చేశారు. ఆయనకు నార్కో టెస్ట్ చేద్దామనుకున్నారు కానీ సాధ్యం కాలేదు. కోర్టు సీబీఐ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇంకాఎంత కాలం సీబీఐ విచారణ జరుగుతుందో ఎవరికీ స్పష్టత లేదు.
ఇలాంటి పరిస్థితి అవమానకరంగా ఉందని త్వరగా విచారణ పూర్తి చేయాలని కోరారని జగన్ మామ, ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. వైఎస్ వివేకాది హత్య అని తెలిసిన తర్వాత చంద్రబాబు చేయించారని మొదటగా ఆరోపించింది రవీంధ్రనాథ్ రెడ్డినే. వివేకా కేసులో మలుపులు ఉంటాయో లేవో కానీ సీబీఐ అధికారులు మాత్రం ఇంత సుదీర్ఘంగా విచారణ చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.