జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయమే ఢిల్లీ వెళ్లీ బీజేపీ ముఖ్య నేతలతో సమావేశయ్యారు. పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లడం.. సమావేశం జరగడం కూడా పూర్తయింది. ఆ తరవాతే జనసేన పార్టీ నేతలు ఈ సమాచారాన్ని బయటకు తెలిపారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనింగ్ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వాన మేరకు పవన్ ఉదయమే ఢిల్లీ వెళ్లాలని జనసేన తెలిపింది. మొదట జోషితో సమావేశమయ్యారని.. తర్వాత బీజేపీ ముఖ్యనేతలతోనూ సమావేశమయ్యారని తెలిపింది. ఆ ముఖ్య నేతలెవరన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.
ఇటీవలి కాలంలో ఏపీలో బీజేపీ-జనసేన మధ్య సమన్వయం లేదు. ఎవరి పోరాటాలు వార ుచేసుకుంటున్నారు. రోడ్లపై జనసేన సొంతంగా డిజిటల్ ఉద్యమం చేపట్టింది. బీజేపీ వినాయక చవితి పండుగపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను నిరసిస్తూ సొంతంగా కార్యక్రమాలు చేపడుతోంది. ఎక్కడా రెండు పార్టీలు కలిసి ఉద్యమాలు చేసే ఆలోచన చేయడం లేదు. అయితే ప్రహ్లాద్ జోషి ఏ కారణంతో పిలిచారో జనసేన స్పష్టత ఇవ్వలేదు. అలాగే బీజేపీ తరపున ఏ ముఖ్య నేతల్ని కలిశారో కూడా జనసేన చెప్పలేదు.
మోడీ, అమిత్ షా , నడ్డా లాంటి పెద్ద నేతలతో భేటీ అయితే ఫోటోలతో సహా చెప్పేవారు కానీ అలాంటి ప్రకటన చేయలేదు. రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. పవన్ కల్యాణ్ ఢిల్లీలోనే ఉండి మోడీ, అమిత్ షా, నడ్డా లాంటి వారితో భేటీ అవుతారా లేక తిరిగి వచ్చేశారా అన్నదానిపైనా జనసేన సైలెంట్‌గా ఉంది.