తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ అధికారికమో.. అనధికారికమో కానీ ఆయన ఢిల్లీలో ఉంటే తెలంగాణలో టీఆర్ఎస్ అనుకూల వర్గాలు చేస్తున్న ప్రచారం మాత్రం బీజేపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తోంది. కేసీఆర్ వారానికిపైగా ఢిల్లీలో ఉన్నారు. అధికారికంగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు గడ్కరీ, షెకావత్లలో సమావేశమయ్యారు. కానీ అనధికారికంగా ఆయన జాతీయ రాజకీయాలపై కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారన్న ప్రచారం తెలంగాణలో జరుగుతోంది. టీఆర్ఎస్ అనుకూల మీడియా, సోషల్ మీడియాలోనే ఈ గాసిప్స్ ప్రారంభమయ్యాయి. ఇవన్నీ బీజేపీతో టీఆర్ఎస్ సన్నిహితం అన్నట్లుగా ఉండటమే అసలు కొసమెరుపు.
గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ఓ రేంజ్లో ఊపు వచ్చింది. ఇక తామే ప్రత్యామ్నాయం అన్నంత దూకుడు చూపింది. వరుసగా పార్టీలో చేరికలు జరిగాయి. టీఆర్ఎస్ నుంచి ముఫ్ఫై, నలభై మంది ఎమ్మెల్యేలు వస్తున్నారంటూ బండి సంజయ్ లాంటి నేతలు బరువైన ప్రకటనలు చేశారు. అయితే కేసీఆర్ ఢిల్లీ పర్యటనతో సీన్ మార్చేశారు. టీఆర్ఎస్ ,బీజేపీ ఒక్కటేనన్న సందేశాన్ని అంతర్లీనంగా పంపేశారు. ఫలితంగా టీఆర్ఎస్ నేతల వలస బీజేపీలోకి ఆగిపోయింది. ఒక వేళ వెళ్లి బీజేపీలో చేరితే.. తర్వాత బీజేపీ టీఆర్ఎస్తో జట్టు కడితే తమ పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన కేసీఆర్ తన పార్టీ నేతలకు కల్పించారు.
ఇప్పుడు కూడా కేసీఆర్ అదే వ్యూహాన్ని అమలు చేశారన్న బలమైన అభిప్రాయం రాజకీయవర్గాల్లో కలుగుతోంది. ఈటల రాజేందర్ పార్టీలో చేరిక తర్వాత బీజేపీ ఊపు మీద ఉంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో సమరం పూరించారు. మరో వైపు బీజేపీ అగ్రనేతలు తరచూ వచ్చి బండి సంజయ్ యాత్రకు సంఘిభావం చెబుతున్నారు. కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే అవన్నీ కేసీఆర్ ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో జరిపిన భేటీలతో కొట్టుకుపోయాయి. సీరియస్ నెస్ తగ్గిపోయిందన్న అభిప్రాయం వినిపించడం ప్రారంభించింది. ఈ ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలో బీజేపీ నేతలకు పెద్ద పజిల్‌గా మారింది.