పార్లమెంట్ ఎన్నికలకు ముందు.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కూటమిని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ట్రై చేశారు. వివిధ రాష్ట్రాల సీఎంలతో.. జాతీయ స్థాయి నేతలతో సమావేశాలు నిర్వహించారు. కుమారస్వామి, శరద్ పవర్, మమత బెనర్జీ, కేజ్రీవాల్, పినరాయ్ విజయన్, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్ లాంటి నేతలతో భేటీ అయ్యారు. అప్పుడు ఆయన బీజేపీ కోసం విపక్షాల్లో అనైక్యత సృష్టించేందుకు ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వినిపించాయి. గత డిసెంబర్‌లోనూ ప్రాంతీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తమని కేసీఆర్ అన్నారు కానీ పరిస్థితులు బాగోలేవని వెనక్కి తగ్గారు. ఇప్పుడు మరోసారి మూడో కూటమి పేరు తెరపైకి వచ్చింది. పేరు ఫెడరల్ ప్రంట్ కాదు. ఇంకా ఖరారు కాలేదు . అయితే ఈ ఫ్రంట్‌కు నాయకత్వం విషయంలో కానీ.. భాగస్వామ్యం అంశంలో కానీ కేసీఆర్ పేరు వినిపించడం లేదు.
ఇటీవల జైలు నుంచి విడుదలైన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నేత ఓం ప్రకాశ్ చౌతాలా ధర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా రాజకీయ పార్టీల కూటమి నిర్వహిస్తున్నారు. దీనికి ములాయం సింగ్ యాదవ్, బిహార్ సీఎం నీతీశ్ కుమార్, దేవేగౌడ, అకాలీదళ్ వంటి పార్టీలు హాజరవనున్నాయి. ఇతర పార్టీలను కూడా చౌతాలా పిలిచారు. బీజేపీ,కాంగ్రెసేతర పార్టీలకు వ్యతిరేకంగా మూడో కూటమి పెట్టాలన్న లక్ష్యంతో చౌతాలా ఉన్నారని అంటున్నారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలే చేసిన కేసీఆర్‌కు ఆహ్వానం పంపారో లేదో స్పష్టత లేదు.
ప్రశాంత్ కిషోర్ వంటి వ్యూహకర్తలు మూడో ఫ్రంట్ అంటే బీజేపీ నెత్తిన పాలు పోసినట్లేనని చెబుతున్నారు. కాంగ్రెస్ కూటమితోనే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తేనే ఫలితం ఉంటుందని అంటున్నారు. అయితే కాంగ్రెస్‌తో కలిసేందుకు కొన్ని పార్టీలు సిద్ధంగా లేవు. కొన్ని పార్టీలు రెడీగా ఉన్నాయి. ఎన్డీఏలో లేకపోయినప్పటికీ చాలా పార్టీలు బీజేపీతో లోపాయికారీ రాజకీయాలు చేస్తున్నాయి. వీరందరూ బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యే చాన్స్ లేదు. కానీ ధర్డ్ ఫ్రంట్‌గా మారవచ్చని చెబుతున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ జాతీయ రాజకీయాలు కూడా ఊపందుకుంటున్నాయి.