విశాఖలో కోర్టు ఉత్తర్వులకు కూడా వక్రభాష్యాలు చెప్పి విశాఖలో కాపులుప్పాడ కొండపై గ్రే హౌండ్స్ స్థలాన్ని తీసుకుని వందల కోట్లతో నిర్మాణం ప్రారంభించేసిన ఏపీ ప్రభుత్వం విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్‌ను కూలగొట్టేసి భారీ కమర్షిల్ కాంప్లెక్స్ నిర్మించి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించింది. బెజవాడ స్టేట్ గెస్ట్ హౌస్‌కు చాలా చరిత్ర ఉంది. అది నగరం నడిబొడ్డున ఉంటుంది. 3.26 ఎకరాల్లో ఉన్న ఈ గెస్ట్ హౌస్ విలువ రూ. పదిహేను వందల కోట్లకుపైగానే ఉంటుంది. గతంలో దీన్ని అమ్మాలని ప్రభుత్వం అనుకుంది. కానీ కోర్టు కేసులతో ఆ ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. అమ్మకపోతే డెలవప్‌మెంట్‌కి ఇస్తే పోతుందన్నట్లుగా ప్రభుత్వం రంగంలోక దిగింది.
విజయవాడ స్టేట్‌గె్‌స్టహౌస్ ఉన్న 3.26 ఎకరాల్లో ఉన్న దీనిని వాణిజ్య భవనంగా మార్చాలని ప్రతిపాదన చేశారు. ఈ బాధ్యతలు కూడా భూములు అమ్మకాలు చూస్తున్న నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ సంస్థకే ఇచ్చారు. 3.26 ఎకరాల్లో వాణిజ్య భవనంగా అభివృద్ధి చేసి .. లీజుకివ్వడమో.. అమ్మడమో చేయబోతున్నారు. ఇందు కోసం డిజైన్లు అందించేందుకు రుద్రాభిషేక్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ప్రభుత్వం అన్ని వ్యవహారాల్లాగే దీన్ని కూడా గోప్యంగా ఉంచుతోంది. జీవోలు ఏవీ బయటకు రావడం లేదు.
నిధుల కోసం విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ అమ్ముతున్న ప్రభుత్వం అదే విశాఖలో వందల కోట్లు వెచ్చించి భారీ ప్రాజెక్ట్ గా మరో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మిస్తోంది. 30 ఎకరాల్లో నిర్మాణాన్ని విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థకు అప్పగించింది. 30 ఎకరాల్లో నిర్మాణం కానున్న ఈ గెస్ట్ హౌస్ కోసం.. ఆర్కిటెక్చర్ .. ఇతర సేవలు అందించేందుకు.. టెండర్లుకూడా ఖరారు చేశారు. ఓ చోట అమ్మడం..మరో చోట కట్టడం ఏమిటన్న సందేహాలు సహజంగానే వస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో అసలు ప్రయోజనం ఏమిటనేది వారికి మాత్రమే తెలుసు. ఇంకెవరికీ తెలియదని విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయి. అలాగే గెస్ట్ హౌస్‌ల అమ్మకం..నిర్మాణం వ్యవహారం కూడా సాగుతోంది.