గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిపోదామనుకున్న కౌశిక్ రెడ్డికి గవర్నర్ తమిళిసై షాకిచ్చారు. సామాజిక సేవలు చేసిన వారికి , ఇతర రంగాలలో ప్రముఖులకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం సంప్రదాయంగా వస్తోందని ఆమె అన్నారు. అందుకే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ సిఫార్సుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా సిఫార్సు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆయన క్రికెట్ క్రీడకు సేవలు చేశారని పేర్కొంది. అయితే ఆ సేవలు గవర్నర్ తమిళిసై అనుకున్న స్థాయికి సరిపోలేదు. పాడి కౌశిక్ రెడ్డిపై పలు రకాల కేసులు ఉన్నాయి. అందులో ఎన్నికల కేసులే కాక ఇతర కేసులు కూడా ఉన్నాయి.
ఆగస్టు మొదటి వారంలోనే గవర్నర్ కు ఫైల్ పంపిప్పటికీ ఇంత కాలం ఆమోదించకపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తమిళిసై మాతృమూర్తి మరణం సందర్భంగా పరామర్శించడానికి హరీష్ రావు రాజ్ భవన్ వెళ్లారు. తన వెంట కౌశిక్ రెడ్డిని కూడా తీసుకెళ్లారు. అప్పుడు ఎమ్మెల్సీగా సిఫార్సుచేయబడిన కౌశిక్ రెడ్డి అని పరిచయం చేశారు. ఆ తర్వాత కూడా గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు. అయితే కేసీఆర్ ఒక మాట చెబితే గవర్నర్ ఆమోదించే అవకాశం ఉంది. కానీ కేసీఆర్ పెద్దగా పట్టించుకోవడం లేదు.
కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ప్రకటించడంపై టీఆర్ఎస్లోనూ అసంతృప్తి ఉంది. ఈ తరుణంలో కేసీఆర్ కూడా మనసు మార్చుకుని గవర్నర్ అభ్యంతరంతో ఆయన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుని వేరే అవకాశం ఉందన్న ప్రచారం టీఆర్ఎస్లో జరుగుతోంది. ఆయనకు మరో పదవి ఇస్తామని హమీ ఇచ్చి… మరో ముఖ్యుడ్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పంపించవచ్చని అంటున్నారు. ఒక వేళ కౌశిక్ రెడ్డి పేరు ఆమోదించాల్సిందేనని కేసీఆర్ పట్టుబడితే మాత్రం గవర్నర్ అభ్యంతరాలు పెద్దగా లెక్కలోకి రావు.