” మందు.. ముక్కా అమ్ముతున్నారు తర్వాత పొందు వ్యాపారం కూడా ప్రారంభిస్తారేమో..!” అని ఏపీ ప్రభుత్వం మటన్ వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించిన తర్వాత ఎక్కవగా ప్రజల్లో వినిపించిన అభిప్రాయం. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు వినిపించడానికి కారణం ప్రభుత్వం ప్రజల జీవనోపాధి మార్గాలన్నింటినీ ఒక్కొక్కటిగా కబ్జా చేస్తూండటమే. తాను వ్యాపారం చేస్తూ ప్రజలకు చిల్లర విదిల్చాలని నిర్ణయంచుకోవడమే. మద్యంతో ప్రారంభమైన ఈ వ్యాపారం మటన్ వరకూ చేరింది. తరవాత ఎక్కడకు చేరుతుందో చెప్పలేని పరిస్థితి.
వ్యాపారం మా పని కాదని తెగనమ్మేస్తున్న కేంద్రం.. కానీ ఏపీలో రివర్స్..!
” వ్యాపారం చేయడం ప్రభుత్వ విధి కాదు .. అందుకే వ్యాపార సంస్థలన్నింటినీ అమ్మేస్తున్నాం” అంటోంది కేంద్ర ప్రభుత్వం. కానీ వ్యాపారం ప్రభుత్వ అధికారం అన్నట్లుగా చెలరేగిపోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏపీలో ఎవరూ వ్యాపారాలు చేయకూడదు చేసినా ఆదాయం ప్రభుత్వానికే రావాలన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మద్యం దుకాణాలతో ప్రారంభిచి చివరికి మటన్ కొట్లను కూడా వదలి పెట్టకుండా ప్రభుత్వం వ్యాపారాల్లోకి దిగడం అందర్నీ విస్మయ పరుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు కూడా అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది..? అని కిందా మీదా పడుతున్నారు. నేరుగా ముఖ్యమంత్రి జగన్‌ను తప్పు పట్టలేక.. ఆయనకు తప్పుడు సలహాలు ఎవరు ఇస్తున్నారు అని వంధిమాగధుల్ని నిందిస్తున్నారు. కానీ అసలు నాయకుడికి నచ్చకపోతే ఆ చచ్చు.. పుచ్చు సలహాలు వారు మాత్రం ఎందుకిస్తారు..?
హవ్వ .. సినిమా టిక్కెట్లు అమ్ముతారా..!?
ఓ ఇరవై ఏళ్ల కిందట బ్లాక్ టిక్కెట్ల బిజినెస్ చాలా జోరుగా ఉండేది. అప్పట్లో ధియేటర్లలో మాత్రమే సినిమాలు విడుదలయ్యేవి. కొత్త సినిమా విడుదలైతే.. రూ. యాభై వరకూ ఉండే బాల్కనీ టిక్కెట్‌ను రూ. రెండు వందల వరకూ బ్లాక్‌లో ధియేటర్ ఓనర్లు అమ్మేయించుకుంటారు. లేకపోతే క్యూలో నిలబడి నాలుగైదు టిక్కెట్లు తీసుకుని లాభానికి అమ్ముకునే చిరు ” వ్యాపారస్తులు” కూడా ఉండేవారు. ఆ తర్వాత రాను రాను పరిస్థితి మారిపోయింది. ఇలా బ్లాక్ టిక్కెట్ గాళ్లకు ఫ్యాన్స్‌ను వదిలేయడం కన్నా తామే కొంత ఎక్కువ వసూలు చేయాలని సినిమా వాళ్లు అనుకోవడం ప్రారంభించారు. మారిపోయిన పరిస్థితుల్లో సినిమా చూసేందుకు ఎక్కువ కాలం ఎవరూ వేచి ఉండటం లేదు. అందుకే పెద్ద సినిమా రిలీజైతే 80 శాతం ధియేటర్లలో ప్రదర్శించి .. టిక్కెట్ రేట్లు పెంచి తమ ఆదాయాన్ని మొత్తం వారంలోనే కళ్లజూసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ధియేటర్ల టిక్కెట్లు .. బ్లాక్ టిక్కెట్ల వ్యాపారం కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకూ వివిధ సంస్థలు ఆన్లైన్లో అమ్ముతున్న టిక్కెట్లను ఇక ప్రభుత్వ పోర్టల్ ద్వారా మాత్రమే అమ్మాలని ప్రభుత్వం హుకుం జారీ చేయబోతోంది. ఇప్పుడు ప్రజలకు సినిమా టిక్కెట్లను ప్రస్తుతం ఉన్న విధానంలో అమ్మడం ద్వారా వచ్చిన నష్టం..కష్టం ఏమీ లేదు. అలాగే ప్రభుత్వానికి ఎగ్గొడుతున్న పన్ను ఆదాయం కూడా ఏమీ లేదు. సినిమా వాళ్లు తమ హీరోల గొప్పల కోసం… రూ. వంద కోట్ల కలెక్షన్లు వచ్చాయని ప్రకటించుకున్నారంటే దానర్థం వారి అకౌంట్లలో వంద కోట్లు పడ్డాయని కాదు.
సినిమా ఇండస్ట్రీని దెబ్బ తీస్తే ఇష్టం లేని వర్గాలు దివాలా తీస్తాయా..!?
ఏపీలో గత రెండున్నరేళ్ల కాలంలో తీసుకున్న నిర్ణయాలను చూస్తే అసలు పాలన మొత్తం కక్ష సాధింపుల కోణంలో జరుగుతుందనేది బహిరంగరహస్యం. ఏ నిర్ణయం తీసుకుంటే ఎవరు ఆర్థికంగా కుదేలవుతారో అంచనా వేసుకుని ఆ ప్రకారం వెళ్లిపోతున్నారు. మొదట అమరావతిని నిర్వీర్యం చేస్తే తాను బద్దశత్రువులుగా భావించేవర్గం అంతా తిండికి అల్లాడిపోతారని అనుకున్నారు. ఆ పని చేశారు. ఆ తర్వాత పలు రకాల వ్యాపారల మీద దాడి చేశారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారు. సినిమాను నిర్వీర్యం చేస్తే తమకు రాజకీయంగా అడ్డుగా ఉన్న రెండు ప్రధాన వర్గాలు నాశనం అయిపోతాయని ప్రభుత్వ పెద్దలు ఆశలు పెట్టుకున్నట్లుగా సులువుగా గుర్తించవచ్చు. వకీల్ సాబ్ అనే సినిమా విడుదలయ్యే వరకూ సైలెంట్‌గా ఉండి.. విడుదలైన తర్వాత ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు అధికారాన్ని .. వ్యవస్థను దుర్వినియోగం చేయడమే దీనికి సాక్ష్యం. అప్పుడు తీసుకొచ్చిన టిక్కెట్ల జీవోనే వారికి టాలీవుడ్‌పై ఎంత పగ ఉందో అర్థం చేసుకోవచ్చు. పదేళ్ల కిందటి టిక్కెట్ రేట్లను ఖరారు చేశారు. అదేమంటే ప్రేక్షకుల్ని దోచుకుంటున్నారని అసువుగా అనేస్తున్నారు. రూ. 20కూడా విలువ చేయని మద్యాన్ని రూ. 200 వరకూ అమ్ముతూ పేద ప్రజలను పీల్చి పిప్పి చేస్తోంది ఎవరనేది ఇక్కడ ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన పని లేదు.
చివరికి మటన్ వ్యాపారుల్నీ వదలరా..!
మటన్ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించుకుంది. ప్రభుత్వానికి గెజిట్ లాంటి సాక్షి పత్రికలో ఏపీ ప్రభుత్వ బ్రాండ్ మటన్ ఎంత స్వచ్చంగా ఉంటుందో కథలు కథలుగా రాశారు. అంటే బ్రాండ్ బిల్డింగ్ కూడా ప్రారంభించారు. స్వచ్చమైన అద్భుతమైన పోషకాలు గల మటన్ ఏపీ ప్రభుత్వం అమ్మబోతోందని చెప్పడమన్నమాట. అంటే ఇంత కాలం ఇప్పుడు చిన్న చిన్న దుకాణాల్లో ఉన్న మటన్ దుకాణాలు… పెద్దగా క్వాలిటీ లేని అపరిశుభ్ర వాతావరణంలో అమ్మకాలు సాగిస్తున్నాయని పరోక్షంగా చెప్పడమే. మటన్ దుకాణాల మీద ఆధారపడి కొన్ని లక్షల మంది జీవిస్తూ ఉంటారు. వారందరిపై ఎందుకు పగబట్టారో అర్థం కాని పరిస్థితి. వారందరూ దుకాణాలు ఎత్తేసుకుని ప్రభుత్వ మటన్ దుకాణాల్లో.. ఐదు, పదివేలకు ఉద్యోగాల్లో చేరాలేమో..?. ఇవాళ మటన్ అంటే రేపు చికెన్ కూడా ప్రభుత్వమే అమ్మదని గ్యారెంటీ ఏముంది. ఒక్క చికెన్ అనిఏముంది ఏపీలో అమ్మే కిరాణా వస్తువులు సహా అన్నీ ప్రభుత్వమే అమ్ముతుందని… అందరూ వస్తువులు ప్రభుత్వానికే అప్ప చెప్పాలని చట్టం చేసినా చేస్తారు. పాలకుల మైండ్ సెట్ అలా ఉంది.
మద్యం నుంచి ప్రారంభించారు అలా వ్యాపారం విస్తరించుకుంటూ పోతున్నారు…!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా మద్యం వ్యాపారాన్ని టేకోవర్ చేసి పడేశారు. ప్రభుత్వం మద్యం ఏమిటి అని వచ్చిన విమర్శలను లైట్ తీసుకున్నారు. కానీ ఆ వ్యాపారంలో ఉండే లాభాలేంటో వారికి తెలుసు. మద్యం తాగే వారికి ఏంకావాలో అది కాకుండా ఏ మద్యం ఇస్తే ఆ మద్యం తాగాలన్న రూల్ తీసుకొచ్చి వేల కోట్లు పిండేసుకుంటున్నారు. అక్కడ్నుంచి వస్తున్న ఆదాయం చాలా బాగా ఉందేమో కానీ మిగిలిన రంగాలపైనా కన్నేసారు. వరుసగా విస్తరించుకుంటూ పోతున్నారు. ఇసుక మొత్తాన్ని గుంపగుత్తగా ఓ కాంట్రాక్టర్‌కు ఇచ్చేశారు. నదీ గర్భాల్లో వందల లారీలతో అర్థరాత్రుళ్లు కూడా ఆగకుండా ఇసుక తవ్వుకెళ్లిపోతున్నారు. ఇక లేటరైట్ సహా వివిధ ఖనిజాల వ్యాపారం గురించి మీడియాలో వస్తున్న కథనాలు .. ఎన్జీటీ విచారణలు చూసి సగటు ఆంధ్ర వాసి నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. ఇప్పుడు సినిమా టిక్కెట్లు.. రేపు మటన్ వ్యాపారం.. రేపుమరో వ్యాపారం ఇలా ప్రభుత్వం వ్యాపారరంగంలో దూసుకెళ్తూనే ఉండే అవకాశం ఉంది.
అంత గొప్ప వ్యాపార తెలివి ఉంటే గంగవరం పోర్టును నిర్వహించలేకపోయారా..?
లాభాల్లో ఉన్న గంగవరం పోర్టును వదిలేసిన మటన్ వ్యాపారం చేస్తారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన జగన్‌ను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ మాటలన్నా… తరచి చూస్తే ఇందులో ఎంతో విస్తృతార్థం ఉంది.గంగవరం పోర్టు భారీ లాభాల్లో ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి వస్తున్న బిజినెస్సేవారికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుస్తుంది. రూ. ఐదు వందల కోట్ల నగదు నిల్వలున్నాయి. అసలు ఏమీ చేయకుండానే ఏడాదికి రూ. మూడు వందల కోట్ల వరకూ పన్నులు, లాభాలు పొందుతున్న ప్రభుత్వం తనకు ఉన్న వాటాను కారణం లేకుండానే రూ. ఆరు వందల కోట్లకు అమ్మేయడాన్ని ఏమనుకోవాలి..?. ప్రజాధనం అంటే ఏ మాత్రం పట్టింపు లేకుండా వ్యవహరించడం అంటే ఇది కాదా . అలాంటి వ్యాపార సంస్థను వదులుకుని టిక్కెట్లు అమ్ముతాం.. మటన్ మార్టులు పెడతాం అంటే ప్రజలు నవ్వుకోరా..?
ఎవర్ని ప్రశాంతంగా బతకనిస్తున్నారు..!?
ప్రభుత్వం వచ్చిన తరవాత ఏ ఒక్క వ్యాపారమూ ఏపీలో ప్రశాంతంగా లేదు. చివరికి భావి భారత పౌరుల్ని సిద్ధం చేసే స్కూళ్లు కూడా దివాలా దీసే స్థితికి వచ్చాయి. వాటి యజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ మాత్రం ఆలోచన లేకుండా స్కూలు ఫీజులు నిర్ణయించి అంతే వసూలు చేయలంటున్నారు. ఇక వైద్య రంగంలో ఏర్పడిన పరిస్థితుల్ని.. ప్రభుత్వం కల్పించిన దుర్భర పరిస్థితులు రమేష్ ఆస్పత్రి యజమానికి ఎదురైన ఘటన .. తనిఖీల పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల్లో సాగిన వసూళ్ల దంతాతోనే తేలిపోయింది. సినిమా హాళ్లు ఎప్పుడో మూతబడ్డాయి. టిక్కెట్ల నిర్ణయం కారణంగాఇక తెరుస్తారో లేదో క్లారిటీ లేదు. ఇసుకను ఓ కంపెనీకి కట్టబెట్టేశారు. నిర్మాణ రంగాన్ని పడుకోబెట్టేశారు. ఏపీలో ఏ వర్గమూ సంతోషంగా లేని పరిస్థితి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరింపులతో వసూళ్ల చేసుకుంటున్న ఘరానా అధికార పార్టీ నేతలుమాత్రమే కాస్త బాగున్నారు. మిగతా వారంతా ఉపాధి కూడా కోల్పోయే దుర్భర పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. చివరికి రేషన్ బియ్యం కూడా ప్రశాంతంగా తెచ్చుకోలేని దౌర్భగ్య స్థితి ఏర్పడిందంటే దానికి ఎవరు బాధ్యులు..?
ప్రభుత్వం ఇదంతా తెలిసీ తెలియక చేయడం లేదు. తెలిసే చేస్తోంది. ఎందుకలా చేస్తుందో అంచనా వేయడం కష్టం. బహుశా అందర్నీ ఆర్థికంగా కుప్పకూల్చేసి.. తాను ఇచ్చే రేషన్ బియ్యం, పథకాల సొమ్ముతోనే బతికేలా చేస్తే ఇక చచ్చినట్లుగా తనకే ఓటు వేస్తారన్న ఆలోచన పాలకుల్లో ఉందేమోనని రెండున్నరేళ్ల పాలన చూస్తే అర్థమవుతుంది. అలాంటి ఆలోచనే ఉంటే ఇక ప్రజలను ఆ దేవుడు కూడా కాపాడలేడు.