ఇంగ్లాండ్‌తో ప్రారంభం కావాల్సిన ఐదో టెస్టు గందరగోళం మధ్య రద్దయింది. కోచ్ రవిశాస్త్రి ఇప్పటికే కోవిడ్‌కు గురి కాగా.. నిన్న ఫిజియోకు కూడా కరోనా సోకినట్లుగా తేలింది. హుటాహుటిన ఆటగాళ్లందరికీ కరోనా టెస్టులు చేయిస్తే.. నెగెటివ్ వచ్చింది. దాంతో టెస్టు మ్యాచ్ యథావిధిగా ఉంటుందని ప్రకటించారు. అయితే మ్యాచ్ ప్రారంభమయ్యే కొద్ది సేపటి ముందు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లుగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మొదట వాయిదా అని అనుకున్నారు. కానీ మ్యాచ్ ఆడేందుకు భారత్ ఆసక్తిగా లేదని.. అందుకే తమను తాము విజేతగా ప్రకటించుకున్నట్లుగా ఈసీబీ ప్రకటించింది.
దీంతో భారత్ ఫ్యాన్స్ ఉలిక్కి పడ్డారు . కాసేపటికే బీసీసీఐ మ్యాచ్‌ను రద్దు చేయమని కోరలేదని మరో రోజు నుంచి ప్రారంభిద్దామని ఈసీబీతో చర్చలు ప్రారంభించింది. రీషెడ్యూల్ చేద్దామని ఈసీబీని కోరినట్టుగా బీసీసీఐ తెలిపింది. మ్యాచ్ నిర్వహణకు సరైన విండోను ఇరు బోర్డులు కనుగొంటాయని బీసీసీఐ సెక్రటరీ జే షా చెప్పుకొచ్చారు. అసలు టెస్టు మ్యాచ్ విషయంలో ఇంత గందరగోళం ఎందుకు ఎర్పడిందో ఎవరికీ అర్థం కాని విషయం.
ఫిజియోకు కరోనా సోకిందని తేలిన తర్వాత కూడా మ్యాచ్ ఆడాలని నిర్ణయించారు. మరి చివరి క్షణంలో ఎందుకు వద్దనుకున్నారు..?. నెలాఖరు నుంచి మిగిలిన ఐపీఎల్ దుబాయ్ లో ప్రారంభం కావాల్సి ఉంది. టీమిండియా ఆటగాళ్లు ఎవరైనా కరోనా బారిన పడితే అది మొత్తం టోర్నీపై ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో జేషా ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఈ కారణంగానే గందరగోళం తలెత్తినట్లుగా భావిస్తున్నారు.