శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్‌పై సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తేజ్‌కి గాయాలయ్యాయి. ఆయన అపస్మారక స్థితిలోకి కూడా వెళ్లిపోయారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష పూరితమైన, వేగవంతమైన డ్రైవింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాధమిక నిర్దారణకు వచ్చారు. దాంతో సాయిధరమ్ పై ఐపీసీ సెక్షన్ 336, మోటర్ వెహికిల్ యాక్ట్ 184 కింద రెండు కేసులు నమోదు చేశారు. తేజ్ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఆయన మద్యం సేవించి సేవించి ఉన్నాడని ముందు అనుమానించారు. కానీ అలాంటిదేం లేదని వైద్యులు క్లారిటీ ఇచ్చారు. లేదంటే… డ్రంక్ అండ్ డ్రైవ్ సెక్షన్ లో మరో కేసు బుక్ అయ్యేది. తేజ్ కి స్పోర్ట్స్ బైక్స్ అంటే ఇష్టం. ఖాళీ సమయాల్లో షికారు కొడుతుంటాడు. అయితే కేబుల్ బ్రిడ్జ్‌పై ఇసుకు పేరుకుపోవడంతో బండి అదుపు తప్పింది. ఆ సమయంలో తేజ్ ఏ స్పీడులో బండి నడుతున్నాడో తెలియాల్సివుంది. సీసీ కెమెరా ఫుటేజీ చూస్తుంటే… తేజ్ మరీ ప్రమాదకరమైన వేగంతో బండి నడపడం లేదని అర్థమవుతోంది.