పక్కా మాస్ సినిమా పడితే.. కచ్చితంగా జనాలు థియేటర్లకు వస్తారన్నది నిర్మాతలు, పంపిణీదారుల నమ్మకం. దాన్ని `సిటీమార్` కొంత వరకూ నిలబెట్టింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి రివ్యూలు నెగిటీవ్ గా వచ్చినా, వసూళ్లు బాగున్నాయి. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో సిటీమార్ ప్రభావం చూపిస్తోంది. పండగ రోజు కావడం, సిటీమార్ తప్ప మరో ఆప్షన్ లేకపోవడంతో టికెట్లు బాగానే తెగాయి. శని, ఆది వారాలూ ఈ జోరు కొనసాగితే – సిటీమార్ పాసైపోయినట్టే. ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్.. లవ్ స్టోరీకి బూస్టప్ ఇచ్చినట్టైంది. ఎప్పుడైతే సిటీమార్ కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయని తెలిసిందో.. అప్పుడే లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ప్రకటించేశారు నిర్మాతలు ఈనెల 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు అధికారికంగ ఆప్రకటించారు. నిజానికి మాస్ సినిమాకి ఉండే ఆకర్షణే.. లవ్ స్టోరీలకూ ఉంటుంది. పైగా శేఖర్ కమ్ముల నుంచి ఓ లవ్ స్టోరీ వస్తోందంటే అంచనాలు భారీగా ఉంటాయి. దానికి తోడు.. సాయి పల్లవి లాంటి కథానాయిక, సారంగ దరియా లాంటి పాట ఉండడం పెద్ద ప్లస్సులు. లవ్ స్టోరీ కూడా క్లిక్కయి.. యూత్ తో పాటు కుటుంబ సభ్యులూ థియేటర్లకు వస్తే – తెలుగు చిత్రసీమ దారిన పడినట్టే.