టాలీవుడ్ లో కథల సెలక్షన్ విషయంలో నాని కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గతంలో కొన్నిసార్లు నాని సినిమాలు ఫెయిల్ అయినప్పుడు కూడా కథ సెలక్షన్ పై విమర్శలు రాకపోగా, ఇతర కారణాల వల్ల సినిమా ఫెయిల్ అయిందన్న చర్చ నడిచింది. అయితే ఇప్పుడు మాత్రం నాని జడ్జిమెంట్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
కథలు ఎన్నుకునే విషయంలో చిరంజీవి ప్రశంసలు అందుకున్న నాని:
సరైన కథ లను ఎన్నుకోవడం అన్నది ప్రతి నటుడికి అత్యంత ప్రధానమైన అంశం. ఒక హీరో కెరీర్ విజయవంతం అవుతుందా లేదా అన్నది అతను ఎన్నుకునే కథలపై ఆధారపడి ఉంటుంది. ఒకానొక సమయంలో నాని కథను ఎన్నుకునే విధానం పై అన్ని వైపుల నుండి ప్రశంసలు వినిపించేవి. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని చిరంజీవి నిర్వహించినప్పుడు దానికి నాని హాజరు అవ్వగా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత చిరంజీవి గుర్తుంచుకొని మరీ నాని ని, మీరు దేన్ని ఆధారంగా కథను ఎన్నుకుంటారు అని ప్రశ్నించారు. దానికి నాని సమాధానమిస్తూ అమీర్ పేటలో సత్యం థియేటర్ లో తాను సినిమాలు చూసేవాణ్ణని, ఎవరైనా కథ చెప్పగానే ఈ కథను ప్రేక్షకుడిగా సత్యం థియేటర్లో చూస్తే తానుఎలా స్పందిస్తానో ఆలోచించుకుంటానని, అప్పుడు వచ్చే స్పందన పాజిటివ్ గా అనిపిస్తే ఆ కథ విజయవంతం అవుతుందని భావిస్తానని, అలాంటి కథలను ఎంచుకుంటానని నాని సమాధానం ఇచ్చారు. చిరంజీవి కూడా ఆ సమాధానాన్ని ప్రశంసించారు.
గత మూడేళ్లుగా ఆ జడ్జిమెంట్ కి ఏమైంది
అయితే గత మూడు ఏళ్లు గా కథ ల విషయంలో నాని అంచనా తప్పుతున్నట్లుగా కనిపిస్తోంది. 2017 లో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా హిట్ అయిన తర్వాత నాని సినిమాలన్నీ వరుస పెట్టి ఫెయిల్ అవుతున్నాయి. 2018 లో విడుదలైన కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలు దారుణంగా విఫలం అయ్యాయి. 2019 లో వచ్చిన జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలు కొంతవరకు పర్వాలేదనిపించినా అంచనాలను అందుకోలేక పోయాయి. 2020 సంవత్సరంలో వచ్చిన “వి” సినిమా నాని కెరీర్లో ని డిజాస్టర్ లలో ఒకటిగా మిగిలిపోయింది. ఇక తాజా గా విడుదలైన టక్ జగదీష్ సినిమా, డిజాస్టర్ అయ్యే విషయంలో వి సినిమాతో పోటీపడుతోంది.
ఒకప్పుడు స్టోరీ జడ్జిమెంట్ విషయం లో ఇండస్ట్రీ పెద్దల ప్రశంసలు అందుకున్న నాని గత మూడేళ్లుగా స్టోరీ జడ్జిమెంట్ విషయం లో ఫెయిల్ అవడం చర్చనీయాంశంగా మారింది.