తెలంగాణ మంత్రి కేటీఆర్కు సోషల్ మీడియాలో ప్రశంసలు ఎక్కువగానే వస్తూంటాయి. ఎందుకంటే ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అక్కడిక్కకడే నిర్ణయాలు తీసుకుంటారు. బాధితుల్ని ఆదుకుంటారు. అయితే ఈ సారి ఆయనకు ఆ తరహా ప్రశంసలు రాలేదు. పెద్ద స్థాయి వ్యక్తుల నుంచి వస్తున్నాయి. మీరు గొప్ప వినయవంతులు అని కార్పొరేట్ ప్రపంచం ఆయనను కీర్తిస్తోంది. ఇదంతా ఎందుకంటే ఆయన కేవలం గొడుగు పట్టారు. అందుకే.
మహింద్రా గ్రూప్ కంపెనీ అయిన టెక్ మహింద్రా హైదారాబ్ద్లో ఓ ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ఆ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి టెక్ మహింద్రా సీఈవో గుర్నానీ వచ్చారు. ఆయనతో పాటు మంత్రి కేటీఆర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో హఠాత్తుగా వర్షం పడటంతో కేటీఆర్ గొడుగు తీశారు. టెక్ మహింద్రా సీఈవో గుర్నానీపై చినుకులు పడకుండా పట్టుకున్నారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కార్యక్రమం ముగిసిన తర్వాత గుర్నానీ కూడా కేటీఆర్ గొప్పతనాన్ని ప్రశంసించారు.
ఆ తర్వాత మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా కూడా స్పందించారు. నాయకత్వం, వినయం విడదీయరానివని కేటీఆర్ నిరూపిస్తున్నారని మహీంద్ర కొనియాడారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మొత్తానికి కేటీఆర్ హంబుల్నెస్ కార్పొరేట్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. అది తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు రావడానికి దోహదపడే అవకాశం ఉంది.