గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో భారతీయ జనతా పార్టీ అగ్రజులు మోడీ, అమిత్ షా రాజీనామా చేయించారు. ఉరుము లేని పిడిగులా ఆయనపై వేటు వేస్తారన్న ప్రచారం జరగకుండానే సైలెంట్‌గా పనిపూర్తి చేశారు. మధ్యాహ్నం హఠాత్తుగా గుజరాత్ గవర్నర్‌ను కలిసిన రూపానీ తన రాజీనామా లేఖను ఇచ్చారు. పార్టీ హైకమాండ్ ఆదేశం మేరకే తాను రాజీనామా చేశానని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందుగా అనందీబెన్ పటేల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసి విజయ్ రూపానీకి చాన్సిచ్చారు.
ఆ తర్వాత ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అప్పుడే రూపానీకి బదులుగా పటేల్ వర్గానికి సీఎం పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ రూపానీనే కొనసాగించారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు పటేల్ సామాజికవర్గాన్ని సంతృప్తి పరచడానికి ఆ వర్గానికి సీఎం ఇవ్వాలన్న ఉద్దేశంతో రూపానీని దిగిపోవాలనిఆదేశించినట్లుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీజేపీకి ఎదురుగాలి వీచింది. అయితే బొటాబొటిమెజార్టీతో గట్టెక్కారు. ఇప్పటికి దశాబ్దాలుగా ఆ పార్టీనే అధికారలో ఉంది.
మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే కేంద్ర, రాష్ట్రాల పై ఉన్న వ్యతిరేకతను అధిగమించాల్సి ఉంటుంది.అందుకే కొత్తగా ఇతర వర్గాలను ఆకట్టుకునే లక్ష్యంతో సీఎంలను మారుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఉత్తరాఖండ్, కర్ణాటక, అసోం ముఖ్యమంత్రులను బీజేపీ హైకమాండ్ మార్చేసింది. మోడీ, షాల సొంత రాష్ట్రం గుజరాత్ కావడంతో అక్కడ ఘన విజయం సాధించాల్సిన అవసరం ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా సీఎంను బీజేపీ పెద్దలు మారుస్తున్నట్లుగా తెలుస్తోంది.