ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారాంతం ఆర్టికల్‌లో ఎప్పట్లాగే ఏపీ సీఎం జగన్‌ను టార్గెట్ చేసినా.. ప్రధానంగా సినిమా ఇండస్ట్రీని ఎగతాళి చేయడానికే ఎక్కువ సమయం కేటాయించారు. సినిమా ఇండస్ట్రీ వాళ్లకు గతంలో ప్రభుత్వాలు ఎలా గౌరవం ఇచ్చేవి ఇప్పటి ప్రభుత్వాలు ఎలా జుట్టు పట్టుకున్నాయో వివరంగా విశ్లేషించారు. గౌరవించిన వాళ్లపై కుల ముద్ర వేసేందుకు.. రాజకీయంగా దెబ్బకొట్టేందుకు చేసిన ప్రయత్నాలనూ వివరించి .. ఇప్పుడు బాగా అయిందా అని పరోక్షంగా వెటకారం కూడా చేస్తున్నారు. ప్రభుత్వ సినిమా టిక్కెట్ విక్రయం వల్ల అసలు టాలీవుడ్ పునాదులే కదిలిపోబోతున్నాయని నటులకు గడ్డు కాలం రాబోతోందని ఆర్కే విశ్లేషిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇండస్ట్రీని ఒక్కో విధంలో టార్గెట్ చేశారని ఆర్కే విశ్లేషించారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో కేసీఆర్ ఆస్తులపైకి జేసీబీలను పంపారు. అప్పట్లో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్, అలాగే స్టూడియో స్థలాలపై రచ్చ జరిగింది. కూల్చివేతలు ఖాయమని అనుకున్నారు. కానీ ఆగిపోయాయి. ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆర్కే చెప్పిన దాన్ని బట్టి వారి మధ్య సంధి కుదిరింది. ఏపీలోనూ అంతే. అక్కడ సినిమా వాళ్లకు ఆస్తులు లేవు కాబట్టి వారి ఆస్తులు సినిమా కలెక్షన్లే కాబట్టి అక్కడి ప్రభుత్వం నిర్మోహమాటంగా దెబ్బకొడుతోందని ఆర్కే తేల్చేశారు. ఇక వారు కోలుకోవడం కష్టమని కూడా అంచనా వేస్తున్నారు.
ఆర్కే ఈ వారం లోతైన అంశాల జోలికి వెళ్లలేదు. టాలీవుడ్ పై ఎలాంటి సానుభూతి చూపించలేదు. అలాగని టిక్కెట్ల అమ్మకంపై ప్రభుత్వ నిర్ణయాన్నీ విమర్శించలేదు. ప్రభుత్వం చేస్తున్నది మంచా చెడా అని చీల్చి చెండాడలేదు. ఇండస్ట్రీ వరకూ అది మంచి నిర్ణయం కాదని పరోక్షంగా చెప్పి .. పేరు గొప్ప పెద్దలు నోరు తెరవలేని దుర్భర స్థితికి వెళ్లిపోయారన్న అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేశారు.
అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అవినీతి హద్దులు దాటిపోయిందని చెప్పడానికి తగినంత సమయం తీసుకున్నారు. ఆయన ప్రతి పనికీ పర్సంటేజీలు అడుగుతున్నారని ప్రకటించేశారు. బినామీల చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. అవినీతి వ్యవస్థీకృతం అయిందని తేల్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గురించి ఇలాంటి అవినీతి వార్తలు కామన్ అయిపోయాయి కాబట్టి రొటీన్ అయిపోయింది. ఆర్కే చెప్పినా అంతే సహజం.