భారతీయ జనతా పార్టీ అంటే మోడీ. మోడీ అంటే జనతా పార్టీ. ఇప్పుడు బీజేపీలో ఇదే. పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్గా బీజేపీ అభ్యర్థి ఎవరైనా గెలిస్తే ఖచ్చితంగా క్రెడిట్ మోడీకి ఇవ్వాల్సిందే. లేకపోతే పుట్టగతులు ఉండవు. ఇక ఓడిపోతే .. లేకపోతే అక్కడ పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడితే మాత్రం మోడీకి నయాపైసా సంబంధం ఉండదు. అక్కడ బాధ్యత అంతా స్థానిక నాయకులు తీసుకోవాలి. స్వచ్చందంగా తీసుకుని మోడీని పొడిగి వైదొలిగితే కనీసం వేరే పదవి అయినా వస్తుంది. లేకపోతే.. పీకేసే పరిస్థితి వస్తుంది. చెప్పినప్పుడు తప్పుకుంటే గౌరవంగా ఇతర పదవులు వస్తాయి. బీజేపీలో నేతలంతా ఈపరిస్థితులకు అలవాటు పడ్డారు కాబట్టి సరిపోయింది.
ఇప్పటికి నలుగురు ముఖ్యమంత్రుల్ని పీకేశారు. వారందర్నీ తీసేయడానికి.. మార్పు చేయడానికి కారణంగా బీజేపీ హైకమాండ్ అంతర్గతంగా చెబుతున్న కారణం పని తీరు. వారి పని తీరు బాగోలేదనందున ప్రజల్ని మెప్పించనందున తొలగిస్తున్నట్లుగా చెబుతున్నాయి. ఉత్తరాఖండ్ తీరథ్ రావత్ అయినా… కర్ణాటక యడ్యూరప్ప అయిన.. గుజరాత్ రూపానీ అయినా ప్రజల సమస్యలను తీర్చడంలో విఫలమయ్యారన్న కారణంగానే వేటువేశారు. వారి పై ప్రజల్లో అసంతృప్తి ఉందన్న కారణంగానే తొలగించారు. కానీ ఆ అసంతృప్తి ఎవరి మీద? అంతా తానై వ్యవహరిస్తున్న మోడీ పాలన మీద కాదా..? అనే చర్చ సహజంగానే వస్తుంది.
బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఎవరూ సొంత ఐడెంటీటీ కోసం పాలన చేసే పరిస్థితి లేదు. పై నుంచివచ్చే ఆదేశాల ప్రకారం పని చేయాలి. అలా అయితేనే విధేయత ఉన్నట్లు. సొంతంగా ఏమీ చేయలేని ముఖ్యమంత్రులపైఇప్పుడు ఏమీ చేయడం లేదన్న కారణం చూపి వేటు వేస్తున్నారు. గుజరాత్ సీఎం రూపాణీ తన అభిప్రాయాన్ని విధేయత రూపంలోనే వ్యక్తం చేశారు. మోడీ మార్గదర్శకంలోనే పని చేశానని చెప్పుకొచ్చారు. అంటే తన పాలన సొంతం కాదని మొత్తం మోడీదేనని ఆయన పరోక్షంగా చాటి చెప్పారు. కానీ వేటు మాత్రం ఆయనపై పడింది. మిగతా వారిపైనా అంతే. బీజేపీలో గెలిస్తే మోడీ క్రెడిట్ తేడా వస్తే ఆయనకు సంబంధం ఉండదు అన్న వాతావరణం ఏర్పడిపోయింది.