విజయ్ రూపానీని హఠాత్తుగా ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసిన బీజేపీ హైకమాండ్ ఒక్క రోజులోనే కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేశారు. భూపేంద్ర పటేల్ ఆనే సీనియర్ ఎమ్మెల్యేను ముఖ్యమంత్రిగా ఖరారు చేశారు. ప్రస్తుతం ఆయన రూపానీ కేబినెట్లో మంత్రిగా కూడా లేరు. ఎమ్మెల్యే మాత్రమే. అయితే గుజరాత్లో అత్యధిక మెజార్టీ అంటే లక్షకుపైగా మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే. ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. గతంలోనూ ఆయన మంత్రిగా చేయలేదు. ఎమ్మెల్యే నుంచి ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపడుతున్నారు.
కేంద్రమంత్రిగా ఉన్న మన్సుఖ్ మాండవీయ గుజరాత్ కేబినెట్లో ఇప్పటికే ఉన్న ఇద్దరు పటేల్ వర్గానికి చెందిన మంత్రులు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు . అయితే చివరికి భూపేంద్ర పటేల్ వైపే మోడీ, షా మొగ్గు చూపారు. మాజీ ముఖ్యమంత్రి అనందీబెన్ పటేల్ ఆశీస్సులు భూపేంద్ర పటేల్‌కు ఉన్నట్లుగా తెలుస్తోంది. గుజరాత్లో పాటీదార్లుగా పిలిచే పటేల్ సామాజికవర్గ ప్రజలు క్రమంగా బీజేపీకి దూరమవుతున్నారు. ఈ పరిస్థితి కారణంగా గుజరాత్లో బీజేపీ పట్టు కోల్పోయే పరిస్థితి వచ్చింది. విజయ్ రూపానీ పాటిదార్ కాదు.
మరో వైపు పాటిదార్లు తమకు ప్రాధాన్యత దక్కడం లేదన్న అసంతృప్తిలో ఉన్నారు. వీరందర్నీ రిజర్వేషన్ల కోసం ఏకం చేసిన హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల కు ఇప్పటి నుండే కసరత్తు చేస్తున్న బీజేపీ ముఖ్యమంత్రిగా పటేల్ సామాజికవర్గానికి చాన్సిచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మార్పు గుజరాత్లో బీజేపీకి మళ్లీ పీఠం కట్టబెడుతుందో లేదో ఎన్నికలయిన తర్వాతే తేలే చాన్స్ ఉంది .