రాయలసీమ ప్రాజెక్టుల్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మీటింగ్ పెట్టుకున్న టీడీపీ రాయలసీమ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి గట్టి షాక్ ఇచ్చారు. ముందు కార్యకర్తల్ని ఆదుకునేందుకు సమావేశాలు పెట్టాలని చెప్పి కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డిలపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ నేతలు వైసీపీ నేతలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సహజంగానే సంచలనం సృష్టించడంతో ఆదివారం అనంతపురం టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా ఖండించడం ప్రారంభించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శలను ఎదుర్కొన్న పల్లె రఘనాథరెడ్డి తానేమీ ఫ్యాక్షనిస్టును కాదని మండిపడ్డారు.
తన నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో అన్ని చోట్లా అభ్యర్థుల్ని నిలబెట్టానని తాడిపత్రిలో 24 గ్రామాల్లో అభ్యర్థుల్ని ఎందుకు నిలబెట్టలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. జేసీ సోదరులు టీడీపీలో లేనప్పుడే ఎక్కువ స్థానాలు గెలిచామని… జెడ్పీని కూడా గెలిపించుకున్నామన్నారు. తన డ్రెస్సింగ్ స్టైల్‌పై జేసీ ప్రభాకర్ మాట్లాడటాన్ని ఖండించారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరి కాదన్నారు. ఇక జేసీ బ్రదర్స్‌తో చాలా కాలం నుంచి విబేధాలున్న మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అసలు టీడీపీకి సమస్య జేసీ బ్రదర్సేనని తేల్చేశారు. తరచూ జగన్, వైఎస్‌లను పొగుడుతూ టీడీపీ కార్యకర్తలను కించ పరుస్తున్నారని మండిపడ్డారు.
మరో సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కూడా జేసీ ప్రభాకర్ విమర్శలపై స్పందించారు. కాల్వ శ్రీనివాసులపై విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. ఆయన నిబద్ధత కలిగిన టీడీపీ నేత అని.. వ్యక్తిగత విబేధాలుంటే హైకమాండ్‌తో మాట్లాడవచ్చన్నారు. కాల్వ శ్రీనివాసులు అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా పేర్కొన్నారు. వీరి రివర్స్ ఎటాక్‌పై జేస ప్రభాకర్ రెడ్డి ఎలా స్పందిస్తాడన్నదానిపై అనంత టీడీపీలో పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఆధారపడి ఉంటాయి.