రాజకీయంగా అన్న అడుగు జాడల్లోనే షర్మిల నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీ పేరు, రంగులు విషయంలో కాస్త పోలికలు ఉండేలా చూసుకున్న షర్మిల ఇప్పుడు నిర్ణయాలను కూడా అన్న బాటలోనే తీసుకుంటున్నారు. హఠాత్తుగా అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉండగా పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్తిగా శ్రీదేవి అనే నాయకురాల్ని ప్రకటించారు. ఆమె భర్త వైసీపీ నేతగా ఉండగా ఫ్యాక్షన్ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత కూడా కీలకమైన నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించారు.
ఇప్పుడు అదే పద్దతిని షర్మిల ఫాలో అవుతున్నారు. తుంగతుర్తితో దళిత గర్జన సభ పెట్టిన ఆమె అక్కడ అభ్యర్థిగా కళాకారుడు ఏపూరి సోమన్నను ప్రకటించారు. ఏపూరి సోమన్న ఈ సభ మొత్తం బాధ్యతలు తీసుకున్నారు. ఆయన గతంలో పలు పార్టీల్లో ఉన్నా.. ఆయనను కళాకారుడిగానే పరిగణించారు. రాజకీయ నేతగా చూడలేదు. ఈ కారణంగానే అసంతృప్తి చెంది షర్మిల పార్టీలో చేరారు. ఆయన కూడా ఇటీవల అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరిగింది. ఇందిరా శోభన్ రాజీనామా తర్వాత ఏపూరి సోమన్న కూడా బయటకు వెళ్లిపోతారన్న ప్రచారం జరిగింది.
అయితే ఏపూరి సోమన్నకు టిక్కెట్ ప్రకటించడం ద్వారా నిలువరించగలిగారని అనుకుంటున్నారు. ఇక ముందు కూడా ఇదే పద్దతిలో కొంత మందిని అభ్యర్థులుగా ఖరారు చేసి పార్టీ నాయకులకు భరోసా ఇవ్వాలని షర్మిల అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే షర్మిల పార్టీని బలహీన పర్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇతర పార్టీలు ప్రకటించిన అభ్యర్థుల్ని ఆకర్షిస్తే మొదటికే మోసం వస్తుంది కదా అన్న డౌట్ ఆ పార్టీలో ప్రారంభమయింది.