అదానీ గ్రూప్ ఓనర్లయిన అదానీ సోదరులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆదివారం రహస్యంగా కలిశారని మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అయితే దీనిపై స్పందించడానికి పరిశ్రమల మంత్రి గౌతం రెడ్డి నిరాకరించింది. ఆ విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. అదానీతో కొత్త ఒప్పందాలు ఏమీ చేసుకోలేదని వ్యాఖ్యానించారు. అయితే అదానీ బ్రదర్స్ రాకపోతే రాలేదని ఖండించాలి. కానీ మంత్రి తనకు తెలియదని తప్పించుకునే రీతిలో సమాధానం చెప్పడం ఆసక్తి రేపుతోంది.
ఏపీలోని కృష్ణపట్నం, గంగవరం పోర్టులను అదానీ పోర్ట్స్ కొనుగోలు చేసింది. ఈ రెండింటిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అవి దాఖలు చేసింది ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ సానుభూతి పరులన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అదానీ సోదరులు వచ్చి సీఎం జగన్తో సమావేశమయ్యారన్న వార్త సహజంగానే రాజకీయ సంచలనం సృష్టించింది. కృష్ణపట్నం సంగతేమోకానీ గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా అమ్మకంపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా .. అధికారం లేకపోయినా అమ్మేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో హైకోర్టు ప్రొప్రయిట్రీ అడిట్ నిర్వహించాలని పిటిషన్ దాఖలు చేయడంకలకలం రేపుతోంది.
ఈ కొనుగోలు వ్యవహారం వివాదాస్పదం అయితే.. అదానీ పోర్ట్స్ సంస్థకు అనేక ఇబ్బందులు వస్తాయి. ఈ కారణంగానే సమస్యను పరిష్కరించుకోవడానికి అదానీ సోదరులు హైదరాబాద్ వచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే అది అధికారిక పర్యటన కాదు. అందుకే బయటకు చెప్పడం లేదు. వ్యక్తిగతంగా మాట్లాడటానికే ప్రత్యేక విమానంలో వారు వచ్చారని భావిస్తున్నారు. ఈ విషయంలో గౌతం రెడ్డి కూడా తనకేమీ తెలియదని చెప్పడం మరిన్ని ఊహాగానాలకు కారణం అవుతోంది.