తెలుగు మీడియా ఛానల్స్ 90వ దశకంలో, 2000 దశకంలోనూ అగ్రస్థానంలో కొనసాగిన జెమినీ టీవీ గత దశాబ్ద కాలంగా వెనకబడిపోయింది. తాజాగా ఎవరు మీలో కోటీశ్వరుడు, మాస్టర్ చెఫ్ కార్యక్రమాలను భారీ ఎత్తున ప్రారంభించినప్పటికీ, ఆ కార్యక్రమాలు ప్రారంభం కావడానికి ముందు మా టీవీ, జీ తెలుగు, ఈటీవీల తర్వాత నాలుగవ స్థానంలో ఉన్న జెమినీ టీవీ, ఇప్పటికీ అదే నాల్గవ స్థానం తో సరిపెట్టుకుంది. వివరాల్లోకి వెళితే..
తాజా రేటింగ్స్ లోనూ నాలుగవ స్థానానికి పరిమితమైన జెమిని:
2021 సంవత్సరం లో 35వ వారం, అంటే – ఆగష్టు 28వ తేదీ శనివారం మొదలుకొని సెప్టెంబర్ 3వ తేదీ శుక్రవారం వరకు టీవీ చానల్స్ రేటింగ్ లను బార్క్ ఎప్పటిలాగే విడుదల చేసింది. ఈ రేటింగుల ప్రకారం స్టార్ మా ఛానల్ సుమారు 2300 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంటే, రెండవ స్థానంలో జీతెలుగు 1500 పాయింట్లతో కొనసాగుతోంది. దీని తర్వాత ఈ టీవీ 1200 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంటే, జెమినీ టీవీ 1000 పాయింట్లతో నాలుగో స్థానంలో మిగిలిపోయింది.
అందనంత ఎత్తులో మా టివి:
2000 దశకం ప్రథమార్ధం వరకు, తెలుగులో ఈ టీవీ, జెమినీ టీవీ ల మధ్య మాత్రమే పోటీ ఉండేది. మా టీవీ వీటి కంటే చాలా దిగువన ఉండేది. అయితే మురళీ కృష్ణంరాజు నుండి నిమ్మగడ్డ చిరంజీవి నాగార్జున అల్లు అరవింద్ ల చేతిలో కి వెళ్ళిన తర్వాత మాటీవీ స్వరూపం పూర్తిగా మారిపోయింది. కొత్త సినిమాలు తీసుకోవడం, మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ వంటి కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను తమవైపు తిప్పుకోవడం, కార్తీక దీపం లాంటి బ్లాక్ బస్టర్ సీరియల్స్ ను రూపొందించుకోగలగడం వంటి అనేక అంశాలు మా టివి ని ప్రస్తుతం టాప్ పొజిషన్ లో కొనసాగేలా చేస్తున్నాయి.
గత పదేళ్లలో భారీగా ప్రేక్షకాదరణ కోల్పోయిన జెమినీ టీవీ:
మొగలిరేకులు వంటి సీరియల్స్ ప్రసారం అయిన సమయంలో టాప్ పొజిషన్లో కొనసాగిన జెమినీ టీవీ తర్వాత తర్వాత పూర్తిగా ప్రేక్షకులకు దూరమైపోయింది. ఏదైనా కొత్త సినిమా హక్కులు తీసుకుంటే ఆ సినిమా ప్రసార సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో ప్రేక్షకులు ఆ చానల్ వైపు కి వెళ్లడం బాగా తగ్గించేశారు. ఈటీవీ కి జబర్దస్త్, మా టీవీ కి బిగ్ బాస్ లాగా, స్టాండర్డ్ ప్రేక్షకులను తయారుచేసుకునే ఒక్క కార్యక్రమం కూడా గత పదేళ్లలో జెమినీ టీవీ కి లేకపోవడం గమనార్హం.
జెమినీ టీవీ దశ మార్చ లేకపోయిన రెండు భారీ ప్రోగ్రామ్స్:
అయితే ఈ పరిస్థితిని మార్చడానికి జెమినీ టీవీ ఎవరు మీలో కోటీశ్వరుడు, మాస్టర్ చెఫ్ వంటి కార్యక్రమాలను ప్రకటించింది. ఆగస్టు 22వ తేదీన రామ్ చరణ్ చేతుల మీదుగా లాంచ్ అయిన ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమం లాంచ్ ఎపిసోడ్ 11 పాయింట్లకు పైగా టిఆర్పి ని రాబట్టుకుంది. అయితే ఆ ఊపు తదుపరి ఎపిసోడ్ ల లో కనిపించలేదు. రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి పాల్గొన్న మొదటి ఎపిసోడ్ కి వచ్చిన టిఆర్పి రేటింగ్ ని అధిగమించే మరొక ఎపిసోడ్ మూడు వారాలలో మళ్లీ రాకపోవడం గమనార్హం. మొదటి వారం పూర్తయ్యేసరికి 4.8 పాయింట్ సరాసరి టీ ఆర్ పి ని ఎవరు మీలో కోటీశ్వరుడు సాధించింది. అయితే వారం మధ్యలో ఒక వీక్ డే ఎపిసోడ్ కి ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమానికి కేవలం 0.5 టిఆర్పి రేటింగ్ రావడం జెమినీ టీవీ కి మింగుడుపడలేదు. జెమినీ టీవీ కొంత ప్రమోషన్ పెంచడంతో రెండవ వారం మెరుగుపడి, సరాసరి 6.8 పాయింట్ల టిఆర్టి ని ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమం సాధించింది. జెమిని టీవీ వరకు చూసుకుంటే గత వారం వచ్చిన 6.8 మంచి రేటింగ్ అయినప్పటికీ, జెమినీ లో ఈ కార్యక్రమం ప్రసారం అయ్యే అదే సమయంలో మా టీవీలో ప్రసారం అయ్యే దేవత సీరియల్ దాదాపు 10 పాయింట్ల కి పైగా టిఆర్పి సాధించడం తెలుగు టీవీ ప్రేక్షకుల మొగ్గు ఎటువైపు ఉందన్నది చెప్పకనే చెబుతోంది. ఇక తమన్నా హోస్ట్ గా వస్తున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమం టీఆర్ పి 4.5 – 5 మధ్యలో కొట్టుమిట్టాడుతోంది.
ఏది ఏమైనా, మొదటి రెండు స్థానాల్లో ఉన్న స్టార్ మా మరియు జీ తెలుగు లని పక్కన పెట్టినా, జెమిని టివి సమీప భవిష్యత్తులో ఈటీవీ ని అధిగమించి మూడవ స్థానానికి వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు, తమన్నా మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్స్ కొంత వరకు జెమినీ టీవీ పేరు మళ్లీ తెలుగు ప్రేక్షకుల నోళ్ళలో నానేలా చేసినప్పటికీ, 4 వ స్థానం నుండి జెమిని ని పైకి లేపలేకపోయాయి అన్న చర్చ మీడియా వర్గాల్లో జరుగుతోంది. మరి మళ్లీ పుంజుకోవడానికి జెమిని ఏ కొత్త వ్యూహానికి పదును పెడుతుంది అన్నది వేచిచూడాలి.