`మా`లో విందు రాజకీయాల పరంపర కొనసాగుతోంది. ఇది వరకే నరేష్ `మా` సభ్యుల్ని పిలిచి విందు ఇచ్చారు. మొన్నటికి మొన్న.. ప్రకాష్ రాజ్ ఇదే పద్ధతి కొనసాగించారు. హైదరాబాద్ లోని జేఆర్సీ ఫంక్షన్ హాల్ లో దాదాపు రెండొందల మంది `మా` సభ్యులకు లంచ్ ఏర్పాటు చేశారు. వాళ్లతో సమావేశమయ్యారు. `మా` ఎన్నికల విధి విధానాల్ని చర్చించారు. ఇప్పుడు విష్ణు కూడా ఇదే ఫాలో అయ్యాడు. సోమవారం రాత్రి పార్క్ హయత్ లో విష్ణు `మా` సభ్యులకు డిన్నర్ ఏర్పాటు చేశాడు. తను గెలిస్తే ఏం చేస్తాడో.. సభ్యులకు వివరంగా చెప్పాడు. ఈ డిన్నర్ కి దాదాపు వంద మంది సభ్యులు హాజరైనట్టు తెలుస్తోంది.
ఈ విందు రాజకీయాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మా ఎన్నికల్ని సీరియస్ గా తీసుకోవొద్దు… అంటూనే `మా`ని పూర్తిగా రాజకీయం చేసేస్తున్నారని, సభ్యులతో మంతనాల పేరుతో.. వాళ్లకు విందు వినోదాలు ఎరచూపి, వాళ్ల ఓట్లు కొల్లగొట్టే పనిలో ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. `మా` పీఠం కేవలం సేవ కోసమే అయితే… సాధారణ ఎన్నికల స్థాయిలో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు అవసరమా? అని ప్రశ్నిస్తున్నారంతా. ప్రకాష్ రాజ్ విందు విషయం తెలిసి బండ్ల గణేష్ విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విష్ణు టీమ్ కూడా అదే చేసింది. మరి ఈసారి బండ్ల ఎలా స్పందిస్తాడో?