చాలా చిన్న వయసులోనే ఇండ్రస్ట్రీకి వచ్చేశాడు ఉత్తేజ్. సహాయ దర్శకుడిగా, నటుడిగా, రచయితగా రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఇన్నేళ్ల కెరీర్‌లో `సెటిలైపోయాడులే` అని ఒక్కసారి కూడా అనిపించుకోలేదు. అవకాశాలు వస్తూ, వెళ్తున్నా – సరైన బ్రేక్ మాత్రం పడలేదు. సంపాదన కూడా అంతంత మాత్రమే. ఇంట్లో కూడా.. కొన్ని సమస్యలొచ్చాయి. జీవితం మొత్తం ఎగుడూ దిగుడులే.
అయితే ఇటీవలే ఉత్తేజ్ కాస్త కుదుట పట్టాడు. మయూఖ టాకీస్ పేరుతో ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ బాగా పుంజుకుంది. ఇప్పటికి 8 బ్యాచ్‌లను తయారు చేశాడు. ఆర్థికంగానూ నిలదొక్కుకున్నాడు. సొంత ఇంటి కల దాదాపు నిజం చేసుకోబోతున్న వేళ.. ఇంట్లో సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తున్న వేళ.. సడన్ గా అర్థాంగి పద్మని దూరం చేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ… ఉత్తేజ్ జీవితం కుదుపుల్లో పడిపోయినట్టే.
సోమవారం ఉత్తేజ్ భార్య పద్మ మరణించిన సంగతి తెలిసిందే. భార్య మరణంతో.. ఉత్తేజ్ తల్లడిల్లిపోయాడు. ఎవరు పరామర్శకు వచ్చినా, చిన్న పిల్లాడిలా వాళ్లని పట్టుకుని ఏడ్చేయడం… చూపరులకు సైతం కంట తడి పెట్టించింది. చిరంజీవి పరామర్శకు వచ్చినప్పుడైతే… తన దుఖం మరింత కట్టలు తెంచుకుంది. ఉత్తేజ్ ని ఎవరూ ఆపలేకపోయారు. ఉత్తేజ్ కి ఇద్దరు కూతుర్లు. ఓ అమ్మాయికి పెళ్లపోయింది. మరో పాప.. పదో తరగతి చదువుతుంది. తన ఆలనా పాలనా ఇప్పుడు పూర్తిగా ఉత్తేజ్ దే. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి, ఇప్పుడిప్పుడే కాస్త స్థిరపడుతున్న ఉత్తేజ్ జీవితంలో ఇప్పుడు ఓ పెద్ద పిడుగు పడింది. పాపం.. ఎప్పటికి తేరుకుంటాడో?