సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అమ్మాలని సినీ పరిశ్రమ కోరిందని అందుకే తాము నిర్ణయం తీసుకున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. సినీ పెద్దల సూచనలే ప్రభుత్వం పరిశీలించిందని స్పష్టం చేశారు. త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశమై మరోసారి వారి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. ఈ అంశంపై జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇవ్వడానికి ఆయన మీడియా సమావేశం పెట్టారు. ఇటీవల ప్రభుత్వమే సినిమా టిక్కెట్లు అమ్మాలని నిర్ణయించి.. ఆ మేరకు విధి విధానాలు ఖరారు చేసేందుకు కమిటీని నియమించింది. ప్రభుత్వానికి టిక్కెట్ల అమ్మకాలతో ఏం పని అన్న విమర్శలు వచ్చాయి.
ఈ అంశంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే టిక్కెట్ల అమ్మకంపై ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని పేర్ని నాని ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పని ఏది చేపట్టినా విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సినిమా టిక్కెట్ల అమ్మకం విషయంలో పన్ను ఎగవేత జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం గమనించిందన్నారు. బ్లాక్ టిక్కెట్లు అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అయితే సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మాలనే విషయంపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేశారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత విధి విధానాలు ప్రకటిస్తామన్నారు.
మీడియా సమావేశంలో పేర్ని నాని గందరగోళంగా సమాధానాలు చెప్పారు. ఓ సారి నిర్ణయం తీసుకున్నామంటారు. మరోసారి ఇంకా నిర్ణయించలేదంటారు. మరోసారి సినీ పరిశ్రమ పెద్దలే టిక్కెట్లు ప్రభుత్వం అమ్మాలని సూచించారన్నారు. మళ్లీ వారితో సమావేశమై.. సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు. ఇలాంటి గందరగోళంతో పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టారు. అయితే త్వరలో సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశం అవుతామన్న విషయాన్ని మాత్రం కాస్త క్లారిటీగా చెప్పారు. ఇరవయ్యో తేదీన సమావేశం ఉంటుందని ఇప్పటికే టాలీవుడ్ వర్గాలు ప్రకటించాయి.