ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ అంత ఎంత `ప్రేమ` ఉందో… సినీ పెద్దలకు అర్థమవుతూనే ఉంది. టికెట్ రేట్లు తగ్గించడం దగ్గర్నుంచి, ఆ టికెట్లు తామే అమ్ముతాం అన్నంత వరకూ.. ప్రతీసారీ సినిమా వాళ్లపై జగన్ ప్రభుత్వం కక్ష సాధిస్తూనే ఉంది. ఇప్పుడు టాలీవుడ్ పెద్దలపై మరో పెద్ద పిడుగు వేయబోతున్నట్టు టాక్.
ఆంధ్ర ప్రదేశ్ లో స్టూడియోలు నిర్మించుకోవాలన్న ఆశతో చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు లాంటి బడా బాబులతో పాటు కనీసం 20, 30 మంది దరఖాస్తు చేసుకున్నారు. వందల ఎకరాలు ఇవ్వకపోయినా, కనీసం ఒకొక్కరికీ 20 -30 ఎకరాల స్థలాన్నయినా ఇచ్చే అవకాశం ఉందని లెక్కలేసుకున్నారు. రెండు మూడు చోట్ల స్టూడియో నిర్మాణానికి అనువైన భూముల్ని కూడా ప్రభుత్వం గుర్తించింది. త్వరలోనే ఆ భూములపై ఓ స్పష్టత వస్తుందని, అప్లికేషన్ పెట్టుకున్నవాళ్లంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ దరఖాస్తులన్నీ ఏపీ ప్రభుత్వం బుట్టదఖలు చేసినట్టు తెలుస్తోంది. ఏపీలో ఉచితంగా భూముల్ని ఎవరికీ ఇవ్వకూడదని, సినిమా వాళ్లకు అస్సలు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుందని సమాచారం. ఏపీలో రాజధాని విషయంలో స్పష్టత లేదు. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలకే భూమి దొరకడం లేదు. అలాంటప్పుడు సినిమా స్టూడియోలకు ఎందుకు కేటాయించాలన్నది వాళ్ల ప్రశ్న. కేవలం స్టూడియోల కోసం భూములు ఇస్తారన్న ఆశతో.. చిత్రసీమలోని కొంతమంది పెద్దలు జగన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్లూ చేయకుండా, మౌనంగా ఉంటూ వచ్చారు. టికెట్ రేట్లు తగ్గించినప్పుడూ, టికెట్లు మేమే అమ్ముతాం అన్నప్పుడు కూడా ఎవరూ స్పందించనిది అందుకే. ఇప్పుడు భూములు రావని తెలిస్తే.. ప్రభుత్వంతో అవసరం ఏముంది? ఇక మీదట.. సినీ పెద్దల ఆలోచన విధానం, ప్రభుత్వంపై వైఖరి.. రెండూ మారిపోతాయేమో..?