హైదరాబాద్ నగరం లోని సింగరేణి కాలనీ లో ఆరేళ్ల పాప పై జరిగిన అత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజల కు విస్మయాన్ని కలిగించింది. అయితే సెప్టెంబర్ 9వ తేదీన ఈ ఘటన జరిగి ఇప్పటికి ఆరు రోజులు అయినప్పటికీ, ఈ ఘటన వెలుగు లోకి రావడానికి, తెర మరుగు కాకుండా ఉండడానికి సోషల్ మీడియా నే కారణం అయింది తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు అన్న చర్చ జరుగుతోంది. అంతే కాకుండా, ఈ సంఘటన విషయం లో మన మీడియా ప్రవర్తించిన తీరు పై విమర్శలు వినిపిస్తున్నాయి వివరాల్లోకి వెళితే..
హేయమైన సంఘటన:
నల్గొండ నుండి కూలి పనుల కోసం నగరానికి వచ్చిన కుటుంబం లోని ఆరేళ్ళ పాప పై, ఆ పాప ఇంటికి పక్కనే ఉండే రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి, చంపేసి, పరార్ అయ్యాడు. పాప కనిపించక పోయేసరికి కంగారు పడి అన్ని చోట్ల వెతికిన తల్లిదండ్రులు చివరికి అదే వీధిలో జులాయి గా తిరుగుతున్న రాజు పై అనుమానం వచ్చి ఆయన ఇల్లు తాళం పగుల గొట్టి లోపలికి వెళ్ళి చూసే సరికి అక్కడ చిన్నారి పాప విగత జీవిగా పడి కనిపించింది.
పెద్దగా స్పందించని మీడియా:
ఈ ఘటన జరిగిన నాటి నుండి సోషల్ మీడియా వేదిక గా సెలబ్రిటీలు స్పందిస్తూ, చిన్నారి పాప కు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. సెలబ్రిటీలే కాకుండా సామాన్య ప్రజలు సైతం సోషల్ మీడియా వేదిక గా పాప కు జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తీసుకుని రావడమే కాకుండా పోలీసుల పై , వ్యవస్థ పై ఈ కేసు విషయంలో ఒత్తిడి తీసుకు రావడానికి వారు చేయగలిగింది అంతా చేశారు. ఈ అన్యాయాన్ని ఫోకస్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చేయవలసిన తెలుగు మీడియా ఎందుకనో ఈ అంశాన్ని మొదటి నాలుగు రోజుల పాటు పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. ప్రత్యేకించి దళితులు, గిరి జనులు, బడుగులు, పేదల ఇంటికి చెందిన చిన్నారులు, ఆడ పిల్లలు ఇలాంటి అఘాయిత్యాలకు లోనైనప్పుడు మన తెలుగు మీడియా పెద్దగా పట్టించుకోవడం లేదని, దిశ వంటి వారి విషయంలో స్పందించిన తీరు లో, పేద ఆడపిల్లలకు అఘాయిత్యం జరిగినప్పుడు తెలుగు మీడియా స్పందించడం లేదని ఒక విమర్శ చాలా కాలం గా ఉంది. ఇటు వంటి సంఘటనలు జరిగిన ప్రతి సారి తెలుగు మీడియా ఆ విమర్శలు నిజం చేసేలా ప్రవర్తిస్తోంది
అపోలో హాస్పిటల్ బయట మీడియా కు గడ్డి పెట్టిన కుర్రాడు:
అపోలో హాస్పిటల్ వద్ద సాయి ధరంతేజ్ హెల్త్ కండిషన్ గురించి వివరాలు తీసుకొని ప్రసారం చేయడానికి కెమెరాలు వేసుకుని పడి గాపులు కాస్తున్న తెలుగు మీడియా ని ఉద్దేశించి , జన సేన పార్టీ కి చెందిన సంపత్ నాయక్ అనే వ్యక్తి మీడియా పర్సన్స్ ని చూపిస్తూ మరీ కడిగి పడేసిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆరేళ్ల పాప మీద జరిగిన అత్యాచారం గురించి వార్తలు కవర్ చేయకుండా అపోలో హాస్పిటల్ ముందు పోలో మని కూర్చున్న మీడియా వ్యక్తులకు సిగ్గు అనేది ఉందా అంటూ ఆయన చేసిన విమర్శలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారిన తర్వాత తెలుగు మీడియా కొంచెం మేలుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యం లో సోషల్ మీడియా గనుక లేకపోయి ఉంటే ఈ ఘటన అనేక కేసుల లో ఒకటి గా తెర మరుగు అయి పోయి బాధిత కుటుంబం న్యాయాని కి నోచుకోకుండా మిగిలి పోయే పరిస్థితి ఏర్పడి ఉండేది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరి కనీసం ఇప్పటికైనా తెలుగు మీడియా బాధ్యతాయుతంగా నడుచుకోవడం నేర్చుకుంటుందా అన్నది వేచి చూడాలి.