నాగార్జునతో చిరంజీవికి ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది. నాగార్జున `వైల్డ్ డాగ్` సమయంలో చిరు ప్రత్యేకమైన అభిమానంతో ఆ సినిమాని ప్రమోట్ చేశాడు. నాగచైతన్య, అఖిల్ సినిమాల సమయంలోనూ…అంతే. ఇప్పుడు చిరు `లవ్ స్టోరీ`పైనా తన ప్రేమాభిమానాల్ని చూపిస్తున్నాడు. నాగచైతన్య నటించిన ఈ చిత్రం ఈనెల 24న విడుదల అవుతోంది. ఈ ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతోంది. దీనికి చిరంజీవి ముఖ్య అతిథి. సెకండ్ వేవ్ తరవాత.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ల హడావుడి మళ్లీ మొదలైంది. అయితే.. పెద్ద స్టార్లెవరూ ఫంక్షన్లకు రావడం లేదు. `లవ్ స్టోరీ`తో మళ్లీ ఆ హవా మొదలైందనుకోవాలి. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకుడు. పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తోంది. వెండి తెరపై ఓ స్వచ్ఛమైన ప్రేమకథ వచ్చి చాలా రోజులైంది. కాస్త కనెక్ట్ అయినా చాలు.. యువతరం మళ్లీ థియేటర్ల బాట పట్టడానికి `లవ్ స్టోరీ` దోహదం చేస్తుంది.