Telugu360 Rating 2.25/5
కామెడీ సినిమాలెప్పుడూ గిరాకీనే. హాయిగా నవ్వుకోవడానికి మించింది ఏముంటుంది? కాసిన్ని నవ్వులు పంచిస్తే చాలు. లాజిక్కులు మర్చిపోతారు ప్రేక్షకులు. కానీ.. నవ్వించడం అంత తేలిక కాదు. ఈ రోజుల్లో అస్సలు కాదు. ఎందుకంటే…. టీవీల్లో వచ్చే జబర్దస్త్ కామెడీ షోలు చూసీ చూసీ – జనాలకు కామెడీ అత్యంత చవగ్గా దొరికే వస్తువు అయిపోయింది. థియేటర్ కి వచ్చి మరీ నవ్వుకోవాలంటే సినిమాలో సరుకు ఉండాల్సిందే. ఐతే జి.నాగేశ్వరరెడ్డికి కామెడీ పల్స్ బాగా తెలుసు. ఆయన గతంలో హిట్టు కొట్టిన సినిమాలన్నీ కామెడీలే! తనే ఇప్పుడు సందీప్ కిషన్ ని `గల్లీ రౌడీ`గా మార్చాడు. మరి ఈ రౌడీ ఏ మేరకు నవ్వించాడు? నాగేశ్వరరెడ్డి కామెడీ వర్కవుట్ అయ్యిందా, లేదా? సందీప్ కి హిట్టు పడిందా, లేదా?
వాసు (సందీప్ కిషన్)ని ఓ రౌడీ చేయాలని తాతయ్య మీసాల నాయుడు (నాగినీడు) కలలు కంటుంటాడు. ఇష్టం లేకపోయినా.. తాతయ్య కోసం కర్రసాము. కత్తిసాములు నేర్చుకుని – రౌడీగ తర్ఫీదు పొందుతాడు. కానీ రౌడీయిజం మాత్రం చేయడు. సాహిత్య (నిషా శెట్టి) అనే అమ్మాయిని తొలి చూపులోనే ప్రేమిస్తాడు వాసు. సాహిత్య తండ్రి పట్టపగలు వెంకట్రావు (రాజేంద్ర ప్రసాద్) ఓ హెడ్ కానిస్టేబుల్. తన రెండు కోట్ల విలువైన భూమిని బైరాగి అనే రౌడీ షీటర్ కబ్జా చేస్తాడు. తనంటే అందరికీ హడల్. బైరాగిని కిడ్నాప్ చేసి, రెండు కోట్లు డిమాండ్ చేయాలని సాహిత్య అనుకుంటుంది. అందు కోసం వాసు సహాయాన్ని కోరుతుంది. సాహిత్య కోసం వాసు బైరాగిని కిడ్నాప్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ తరవాత ఏమైంది? బైరాగిని విజయవంతంగా కిడ్నాప్ చేశారా? రెండు కోట్లు దక్కించుకున్నారా? అనేదే మిగిలిన కథ.
కామెడీ కోసం పెద్ద పెద్ద కథలు అల్లాల్సిన పనిలేదు. సింపుల్ లైన్ చాలు. ఆ లైన్ ఈ సినిమాలో ఉంది. కాకపోతే… లైనప్పే బాలేదు. రౌడీయిజం అంటే గిట్టని వాడు బలవంతంగా రౌడీ అవ్వడం, అందులోనూ ఓ అమ్మాయి కోసం అనేది ఇంట్రస్టింగ్ పాయింట్. దాన్నుంచే కావల్సినంత కామెడీ పిండొచ్చు. కానీ అది జరగలేదు. బైరాగి కిడ్నాప్ ప్లాన్, ఆ ప్రహసం, హీరోయిన్, వాళ్ల అమ్మ, వాళ్ల బామ్మ, తమ్ముడూ… ఇలా ఓ కుటుంబం అంతా కలిసి ఓ కరుడుగట్టిన రౌడీని కిడ్నాప్ చేయడం…. ఇదంతా చూస్తే `గ్యాంగ్ లీడర్` ఛాయలు కనిపిస్తుంటాయి. గ్యాంగ్ లీడర్ ఓ బలమైన శత్రువుపై ఐదుగురి పగ. ఇందులో అయితే.. ఒకే కుటుంబం పగబడుతుంది. అందులో సిన్సియారిటీ లేకపోవడం, లాజిక్కులు లేకుండా సిల్లీ సీన్లతో లాగించేయాలనుకోవడం `గల్లీ రౌడీ`ని గతి తప్పించేసింది.
రాజేంద్ర ప్రసాద్ నుంచి విలన్ భూమి లాక్కోవడం, ఓ కుటుంబానికి అన్యాయం చేయడం లాంటి సీన్లు.. కాస్త ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకున్నాడు దర్శకుడు. అయితే ఆ తరవాత.. వెంటనే కామెడీ కోసం రకరకాల విన్యాసాలు చేయించేశాడు. దాంతో ఎమోషన్ పూర్తిగా పోయింది. `రెండు కోట్ల భూమిని దారుణంగా లాక్కున్నాడు` అన్న కోపం తెరపై పాత్రలతో పాటు ప్రేక్షకులకీ కలగాలి. కానీ… ఆ పాయింట్ పక్కకు జరిగిపోతుంది. కిడ్నాప్ చేద్దామనుకున్న బైరాగిని సడన్ గా ఎవరో హత్య చేస్తారు. ఆ హత్య చేసిందెవరో తెలుసుకోవడం సెకండాఫ్. అయితే ఆ ట్విస్టు బాగున్నా – దాన్ని చప్పగా రివీల్ చేశారు. సెకండాఫ్ లో జరిగే ఇన్వెస్టిగేషన్ అంతా చాలా సిల్లీగా అనిపిస్తుంది. చాలా సన్నివేశాలు 90 దశకంలో వచ్చిన సినిమాల్నీ, సీన్లనీ గుర్తు చేస్తాయి. నాగేశ్వరరెడ్డి అప్డేట్ అవ్వాలన్న సంకేతాన్ని ఇస్తాయి. వెన్నెల కిషోర్ పాత్రని ప్రవేశ పెట్టి, తన నుంచి కామెడీ పండించి, రిలీఫ్ ఇవ్వాలన్న ప్రయత్నం చేశారు. అది కూడా సఫలీకృతం కాలేదు. బాబీ సింహా పాత్రని దర్శకుడు తన కన్వినెన్స్ కోసం ఎలా కావాలంటే అలా మార్చుకుంటూ వెళ్లాడు. మధ్యమధ్యలో అసలేమాత్రం నవ్వించని ‘బొచ్చు’లో కామెడీ లాంటి ట్రాకులు వచ్చిపడిపోతుంటాయి. దాంతో గల్లీ రౌడీ అటు భయపెట్టక… ఇటు నవ్వించలేక.. సిల్లీగా మారిపోయాడు.
సందీప్ కిషన్ ఇందులో చేసిందేం లేదు. కాస్ట్యూమ్స్ మార్చాడంతే. తన ఎనర్జీకి తగిన కథ కాదు. సరి కదా… ఇలాంటి రొటీన్ రొడ్డకొట్టుడు కథలకు సందీప్ దూరంగా ఉంటే, తన కెరీర్‌కే మంచిది. నిషా శెట్టి మాంటేష్ షాట్లలో మాత్రమే అందంగా కనిపించింది. ఆమె పాత్రని వీలైనంత బలహీనంగా తీర్చిదిద్దారు. బాబీ సింహా పాత్ర సైతం క్లూ లెస్ గా మారింది. రాజేంద్ర ప్రసాద్ అలవాటు ప్రకారం నవ్వించడానికి శతవిధాలా ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. దానికి కారణం.. సీన్లు సరిగా రాసుకోకపోవడమే. వెన్నెల కిషోర్ బాడీ లాంగ్వేజ్ ఈసారి కాస్త కొత్తగా అనిపించింది. ‘రెచ్చగోక్కూ’ అంటూ ఆయనా పాత పంచులనే నమ్ముకున్నాడు.
`పుట్టెనే ప్రేమ` పాట వినడానికి బాగుంది. పిక్చరైజేషన్ కూడా ఓకే. మిగిలిన పాటలు గుర్తుండవు. ఐటెమ్ సాంగ్.. మరో అనవసరమైన రాద్ధాంతం. ఫొటోగ్రఫీ నీట్ గా ఉంది. కథలో కొత్తదనం లేదు. దాన్ని నడిపించే విధానమూ ఓల్డ్ ఫార్మెట్ లోనే సాగింది. ఇలాంటి కథలు కూడా ఓకే అవుతున్నాయంటే, చిత్రసీమలో కథల కొరత ఏమేరకు ఉందో అర్థం చేసుకోవొచ్చు. ఓటీటీ పుణ్యమా అని క్రైమ్ కామెడీ జోనర్లు తెగ చూస్తోంది ప్రేక్షక లోకం. క్రైమ్ లో కొత్త పద్ధతులు, కొత్త జోనర్లూ ప్రపంచ సినిమా పరిచయం చేస్తుంటే.. `గల్లీ రౌడీ` మాత్రం 1980 నాటి కథల దగ్గరే ఆగిపోయాడు.
ఫినిషింగ్ టచ్: ప్రేక్షకులపై దాడి
Telugu360 Rating 2.25/5