చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లిన కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఆయనకు వైసీపీ హైకమాండ్ నుంచి వచ్చిన సూచనల మేరకే వెళ్లారన్న అభిప్రాయం ఆ పార్టీలోనూ కలుగుతోంది. మంత్రి అయన్నపాత్రుడు కోడెల శివప్రసాదరావు వర్థంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన స్వగ్రామం వెళ్లారు. అక్కడ ఆయన ప్రభుత్వ పరిపాలనలపై తిట్టారు. ” చెత్త నా కొడుకులు “అంటూ చెలరేగిపోయారు. ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది వైసీపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించినట్లుగా తెలుస్తోంది. దీంతో వారు చంద్రబాబు ఇంటిని ముట్టడించాలని జోగి రమేష్‌కు సూచించినట్లుగా చెబుతున్నారు.
నిజంగా అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు వైసీపీ వాళ్లకు కోపం తెప్పించి ఉంటే చంద్రబాబు ఇల్లు ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు. గుంటూరు జిల్లా మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంపీలు ఉన్నారు. విజయవాడ నగరంలోనూ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారెవరూ తమ అనుచరులతో రాలేదు. పెడన నుంచి జోగి రమేష్ ఇరవై కార్లలో భారీ కాన్వాయ్‌గా చంద్రబాబు ఇంటికి వచ్చారు. ప్రత్యేకంగా తన అనుచరుల్ని తీసుకు వచ్చారు. అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసుకుని వచ్చారని సులువుగా అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. లేకపోతే వైసీపీ హైకమాండ్ ఆయనను ఎంపిక చేసుకుని.. చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లాలని సూచించినట్లుగా తెలుస్తోందని అంటున్నారు.
పోలీసులు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఉండవల్లి, తాడేపల్లి హై సెక్యూరిటీ జోన్లు, ఎక్కడ ఎవరైనా ముట్టడికి వెళ్తున్నారంటే పోలీసులు అడ్డుకుంటారు. కానీ జోగి రమేష్ ఇరవై కార్ల కాన్వాయ్.. కర్రలు, జెండాలు ఉన్నా ఆపపలేదు. చంద్రబాబు ఇంటి వైపు వెళ్లినా.. చంద్రబాబు ఇంటి దగ్గరకు వెళ్లి రచ్చ చేసినా ఆపలేదు. ఘర్షణ ప్రారంభమైన అరగంట తర్వాత వచ్చారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా అక్కడ ఆలస్యం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే నిజం అయితే పోలీసు వ్యవస్థదే ప్రధాన నేరం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జోగి రమేష్ ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రిని ఇంప్రెస్ చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో జగన్ వద్ద మార్కులు కూడా కొట్టేస్తున్నారు. అసెంబ్లీలో రఘురామకృష్ణరాజును బండబూతులు తిట్టి జగన్ ప్రశంసలు పొందారు. ఇప్పుడు చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లి మరింత అడ్వాంటేజ్ సాధించారు. వచ్చే కేబినెట్ విస్తరణలో కృష్ణా జిల్లా నుంచి ఆయనకు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.