రాజమౌళి విజయ పరంపరలో `విక్రమార్కుడు`ది ప్రత్యేకమైన స్థానం. రవితేజ – రాజమౌళి కాంబో.. ప్రేక్షకుల చేత జింతాత ఆడించేసింది. ఈ సినిమా విడుదలై… దాదాపు 15 ఏళ్లు అయ్యింది. విక్రమ్ రాథోడ్ గా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా వసూళ్ల వర్షం కురిపించుకుంది. ఇంత కాలానికి ఈ సినిమా సీక్వెల్ కోసం ఓ కథ రెడీ చేశారు. రచయిత విజయేంద్రప్రసాద్ విక్రమార్కుడు సీక్వెల్ కి సరిపడా కథ రెడీ చేశారు. అయితే… ఈ కథ రాజమౌళి చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీ. ఆర్.ఆర్.ఆర్ తరవాత మహేష్ తో సినిమా ఉంటుంది. అంటే రాజమౌళి ఖాళీ అవ్వడానికి మరో రెండేళ్లు పడుతుంది. అంఉదకే మరో దర్శకుడికి ఈ కథ విజయేంద్రప్రసాద్ అందించనున్నారని టాక్. ఆ దర్శకుడు ఎవరన్నది తెలియాల్సివుంది. పాన్ ఇండియా సబ్జెక్టుకు కావల్సిన సరుకు విక్రమార్కుడు 2లో ఉందని తెలుస్తోంది. విక్రమార్కుడుసినిమాని అప్పట్లో హిందీతో పాటుగా అన్ని భాషల్లోనూ రీమేక్ చేశారు. ఈసారి ఏకంగా పాన్ ఇండియా సినిమానే తెరకెక్కించాలన్నది ఆలోచన. ప్రస్తుతానికి విజయేంద్ర ప్రసాద్ తో కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలు సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ కథని ఆయన ఏ దర్శకుడి చేతిలో పెడతారో చూడాలి.