అ, కల్కి, జాంబిరెడ్డి చిత్రాలతో ఆకట్టుకున్నాడు ప్రశాంత్ వర్మ. మూడు కథలూ మూడు సెటప్పులు. ఒక కథకీ మరో కథకీ సంబంధమే లేదు. ఇప్పుడు `హను – మేన్`ని రంగంలోకి దించుతున్నాడు. తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. హనుమంతుగా తేజ పాత్రని పరిచయం చేస్తూ ఓ టీజర్ వదిలారు. `హను -మేన్` టైటిల్ బయటకు రాగానే ఇది సోషియో ఫాంటసీనా, పురాణ గాథా? అనే ఆసక్తి నెలకొంది. టీజర్‌తో ఆ ఆసక్తి మరింత రెట్టింపు అయ్యింది. హనుమంతుడి లా విన్యాసాలు చేస్తూ.. గాల్లో ఎగురుతూ, జింకని వేటాడుతూ కథానాయకుడి పాత్రని రివీల్ చేశారు. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే కథ అని అర్థం వుతోంది. హనుమంతుడు చిరంజీవి… తను ఇంకా బతికే ఉన్నాడు, హిమాలయాల్లో తన ఆనవాళ్లు ఇంకా కనిపిస్తాయని కొంతమంది నమ్ముతారు. బహుశా… ప్రశాంత్ వర్మ చెప్పదలచుకున్న పాయింట్ కూడా అదే కావొచ్చు. భారతీయ భాషల్లో విడుదల అవుతున్న తొలి సూపర్ మేన్ సినిమా అంటూ.. ఘనంగా ప్రకటించుకుంది చిత్రబృందం. ఈసినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.