టీ 20 సారధ్యాన్ని వదులుకోవాలన్న కోహ్లి నిర్ణయం సంచలనమైంది. మూడు ఫార్మెట్లనీ కోహ్లీనే నడిపించడం నిజంగానే ఒత్తిడితో కూడుకున్న విషయం. అందుకే ఈసారి టీ 20 ప్రపంచకప్ ముగిశాక… కెప్టెన్సీ నుంచి తప్పుకుని, ఆటగాడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. టెస్ట్, వన్డే పగ్గాలు కోహ్లీ చేతుల్లోనే ఉంటాయి. కోహ్లీ తప్పుకుంటే ఆ స్థానం ఎవరికి దక్కాలి? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కోహ్లి తరవాత అంతటి సమర్థుడు, అనుభవజ్ఞుడు రోహిత్ శర్మనే. కోహ్లి గైర్హాజరీలో… ఎన్నోసార్లు జట్టుని ముందుండి నడిపించాడు. పైగా ఐపీఎల్ లో తనకి తిరుగులేని రికార్డ్ ఉంది. కోహ్లి నేతృత్వంలోని బెంగళూరు ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్పు గెలవలేదు. రోహిత్ మాత్రం ఏకంగా తన జట్టుని ఐదుసార్లు గెలిపించాడు. ప్రతీసారీ ముంబై హాట్ ఫేవరెట్టే. కానీ బెంగళూరు ఎప్పుడు ఎలా ఆడేదో అర్థమయ్యేది కాదు. మేటి ఆటగాళ్లు ఉన్నా బెంగళూరుకి ఒక్కసారి కూడా కప్ అందించలేదన్న వెలితి… కోహ్లీ కి ఉంది.
ఈ లెక్కన టీ 20 పగ్గాలు రోహిత్ కే అప్పగించాలి. కానీ… రోహిత్ చిన్నవాడేం కాదు. తన వయసు 34 ఏళ్లు. ఈ వయసులో టీ 20 జట్టుని ఎలా నడిపిస్తాడు? ఇప్పుడు కావల్సింది యువ రక్తమే. కాబట్టి… యువ ఆటగాళ్లలో ఎవరికో ఒకరికి టీ 20 పగ్గాలు అప్పగించాలన్న వాదన వినిపిస్తోంది. రాహుల్, పంత్ లాంటి వాళ్ల పేర్లు పరిశీలనకు వస్తున్నాయి. నిజానికి వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ ని ఆ పదవి నుంచి తప్పించాలని, యువకులకు అవకాశం ఇవ్వాలని కోహ్లి బోర్డుని కోరినట్టు వార్తలొస్తున్నాయి. ఇది వరకటి నుంచీ కోహ్లీ- రోహిత్ మధ్య విబేధాలు ఉన్నాయని, అందుకే తాను వెళ్తూ వెళ్తూ.. రోహిత్ వైస్ కెప్టెన్సీకి ఎసరు పెట్టాలని కోహ్లి నిర్ణయించుకున్నాడని టాక్ వినిపిస్తోంది. రోహిత్ కి కూడా కెప్టెన్సీపై మోజు లేదు. అందుకే… తాను కూడా ఆసక్తి చూపించకపోవొచ్చు. మరి ఎప్పుడు ఎలా ఆడతాడో తెలియని పంత్ కీ, అప్పుడప్పుడూ మెరిసే రాహుల్ ఈ స్థానానికి అర్హులా…? ఈ విషయం బోర్డే తేల్చాలి.