రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను తెలంగాణ మంత్రి కేటీఆర్ సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. ఎక్కువగా కేటీఆర్‌ను టార్గెట్ చేసే చేశారు కానీ ఎక్కడా ఆయన పేరు చెప్పలేదు. అయితే శనివారం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేటీఆర్ రేవంత్ రెడ్డి తనపైనే విమర్శలు చేస్తున్నారని ఫిక్సయి.. డ్రగ్స్ టెస్టుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఎవడో పిచ్చోడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి లేఖ ఇచ్చాడని మండిపడ్డారు. తనకు డ్రగ్స్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. కావాలంటే బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, అవసరమైన ఇతర శాంపిల్స్ ఇవ్వడానికి నేను సిద్ధమేనని స్పష్టం చేశారు.
అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అందుకు సిద్ధపడాలని చాలెంజ్ చేశారు. ఇక నుంచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు పెడుతామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌పై నోరు పారేసుకుంటే చూస్తు ఊరుకునేది లేదన్నారు. అవసరమైతే రాజద్రోహం కేసులు కూడా పెడతామన్నారు. ఒకప్పుడు సున్నాలు వేసిన వ్యక్తి.. ఇవ్వాళ కన్నాలు వేస్తున్నారని రేవంత్ రెడ్డిపై సెటైర్ వేశారు.
అదే సమయంలో శశిథరూర్‌ను రేవంత్ రెడ్డి గాడిద అనడంపైనా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గాడిదలు అయితే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరి అడ్డగాడిదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు నిజమైన ముక్తి రాష్ట్రం ఏర్పడటంతోనే జరిగిందని తెలిపారు. బీజేపీకి సాయుధ పోరాటం గురించి మాట్లాడే హక్కు లేదని, ఆనాడు సాయుధ పోరాటం చేసింది కమ్యునిస్టులేనని కేటీఆర్ గుర్తుచేశారు.