బెంగాల్ బీజేపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఓ వైపు వలస వచ్చిన నేతలంతా వరుస కట్టి బయటకు పోతూంటే… ముందు నుంచీ ఉన్న నేతలు కూడా.. అదే బాట పడుతున్నారు. నిన్నగాక మొన్న కేంద్ర మంత్రి పదవిని పోగొట్టుకున్న బాలీవుడ్ సింగర్ బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్లో చేరిపోయారు. ఇటీవలే ఆయన బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఆయన తాను ఏ ఇతర పార్టీలోనూ చేరడం లేదని సామాజిక సేవ దిశగా వెళ్తున్నానని ప్రకటించారు. మొదట ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆయన తర్వాతపదవికి రాజీనామా చేయబోనన్నారు.
బాలీవుడ్లో హిట్ సాంగ్స్ సింగల్గా బాబుల్ సుప్రియోకు మంచిపేరు ఉంది. బెంగాల్లో ఎలాంటి క్రేజ్ లేనప్పుడు… క్రేజ్ ఉన్న అభ్యర్థుల కోసం బీజేపీ చూస్తున్నప్పుడు ఆయనకు సుప్రియో కనిపించారు. ఆయన కూడా అంగీకరించడంతో అసన్ సోల్ అనే లోక్ సభ నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చారు. అక్కడ పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత రెండో సారి కూడా… 2019లో గెలిచారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే… అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న లక్ష్యంతో ఆయనను ఎమ్మెల్యేగా బరిలో నిలిపారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఎమ్మెల్యేగా ఓడిపోయారు.
దాంతో.. బీజేపీ హైకమాండ్ ఆయన కేంద్రమంత్రి పదవిని పీకేసి.. బెంగాల్లో ఇతరులకు ఇచ్చింది. అదే సమయంలో బెంగాల్ బీజేపీ అగ్రనేతలకు సుప్రియోకు పొసగడం లేదు. చివరికి ఆయన తాను పార్టీలో ఉండటం దండగనుకున్నారు. రాజీనామా చేసేశారు. ఇప్పుడు తృణమూల్లో చేరారు. అసలే కష్టాల్లో ఉన్న బీజేపీకి సిట్టింగ్ ఎంపీ తృణమూల్లో చేరడం షాక్ లాంటిదే.