తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కిషన్ రెడ్డి సిఫార్సులో తెలంగాణకు చెందిన వరప్రసాద్ అనే వ్యక్తిని ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో చేర్చి పదవి ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై నేరుగా కిషన్ రెడ్డి స్పందించారు. తన పేరు ఏమైనా అలాంటి సిఫార్సు లేఖలు వస్తే అవి నకిలీవని.. తాను కేంద్ర మంత్రిగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎవర్నీ సిఫారసు చేయలేదని ఆయన స్వయంగా ఏపీ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. ఇప్పుడీ అంశం సంచలనం అవుతోంది. బీజేపీ పెద్దల ఆశీస్సులు పొందేందుకు టీటీడీ బోర్డులో పదవుల కోసం ఆ పార్టీ నేతలు ఎవర్ని సిఫారసు చేసినా వారికి ఓ ప్రత్యేక ఆహ్వానితుల కేటగిరిలో పదవులు ఇచ్చేశారన్న అభిప్రాయం బలంగా ఉంది.
ముక్కూమొహం తెలియని వాళ్లందర్నీ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో చేర్చారు. అయితే వారి గురించిన సమాచారం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. పలువురిపై కేసులు ఉన్నాయని.. అనేక మంది అక్రమాల్లో నిష్ణాతులు అన్న ఆరోపణలు వస్తున్నాయి. చివరికి పదవుల్ని కూడా ఇలా ఫేక్ లెటర్లతో పొందారన్న ఆరోపణలు కూడా ప్రారంభమయ్యాయి. ఎన్నడూ లేని విధంగా శ్రీవారి పాలక మండికి ఎనభై మందితో జంబో కమిటీని నియమించడం వివాదాస్పదమవుతోంది.
అందులోనూ నేరగాళ్లను నియమించడం మరింత వివాదాస్పదం అవుతోంది. తమిళనాడు నుంచి నియమించిన కన్నయ్య అనే వ్యక్తిపై సీబీఐ కేసులు చాలా ఉన్నాయి. ఈ బోర్డుపై విమర్శలు అంతకంతూ పెరుగుతున్నాయి. భక్తుల మనోభావాలకు ముడిపెడ్డి రాజకీయ పార్టీలు ఉద్యమం చేస్తే ఈ వ్యవహారం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.