తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ కూల్‌గా ఉంటారు. రాజకీయాలనూ అంతే కూల్‌గా చేస్తారు. కానీ ఆయన ఇటీవల కంట్రోల్ తప్పిపోతున్నట్లుగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రగ్స్ ఆరోపణలపై ప్రత్యేకంగా మీడియాను ప్రగతి భవన్‌కు పిలిచి మరీ చిట్‌చాట్‌గా మాట్లాడారు. రేవంత్ రెడ్డిపై దేశద్రోహం కేసులు పెడతామని హెచ్చరించారు. రాజకీయ విమర్శలను రాజకీయంగా ఎదుర్కోవడానికి సిద్ధపడాల్సింది పోయి.. రాజద్రోహం.. దేశద్రోహం కేసులు పెడతామని హెచ్చరించడం.. బెదిరించడంతో జర్నలిస్టులు కూడా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. అదే సమయంలో తను డ్రగ్స్ టెస్టులు చేయించుకోవడానికి రెడీ అన్న ఆయన సంబంధం లేని రాహుల్ గాంధీని ఈ ఇష్యూలోకి తెచ్చారు. తనతో రాహుల్ టెస్టులు చేయించుకోవాలని ప్రకటించడం ద్వారా కేటీఆర్ మరో వ్యూహాత్మక తప్పిదం చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
టెస్టులను తప్పించుకోవడానికే అలా చేశారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతుంది. వెంటనే రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని టేకప్ చేసి… వైట్ చాలెంజ్ విసిరారు. ఉస్మానియాలోకి వెళ్లి టెస్టులు చేయించుకుందామన్నారు. ఈ వ్యవహారంపై కేటీఆర్ స్పందన చూస్తే ఆయన అనవసరంగా ఆవేశపడ్డారన్న అభిప్రాయం టీఆర్ఎస్ నేతలకూ కలుగుతోంది. అయితే చిట్‌చాట్‌లోనే మొదటి సారి కాదు. ఇటీవల శశిథరూర్‌ను రేవంత్ రెడ్డి గాడిద అని తిట్టారు. అది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ. అయితే కేటీఆర్ దాన్ని టేకప్ చేసి.. కాంగ్రెస్‌పై తనకు ఎంతో అభిమానం ఉందని.. రేవంత్ రెడ్డి నాయకుడు అక్కడ ఉండకూడదన్నట్లుగా ట్వీట్ చేయడంపైనా టీఆర్ఎస్లో చర్చలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డిని ఘాటుగా దూషించడానికి ఆయన వెనుకాడలేదు.
ఆదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్.. రేవంత్ రెడ్డి చిట్ చాట్ గా మాట్లాడిన మాటలను రికార్డు చేసి కేటీఆర్ కు ఇచ్చిన జర్నలిస్టులను సుపారీ జర్నలిస్టులుగా ట్వీట్ చేశారు. ఆయనపైనా కేటీఆర్ విరుచుకుపడ్డారు. రూ. యాభై కోట్లు తీసుకుని పీసీసీ చీఫ్ ఇచ్చారని మీ పార్టీ వాళ్లే అంటున్నారని మీరు సుపారీ ఇంచార్జ్ అని ఆయనపై నా విరుచుకుపడ్డారు. కేటీఆర్ తీరు చూస్తూంటే ఆయన క్రమంగా పొలిటికల్ అసహనానికి గురవుతున్నారన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో పెరిగిపోతోంది. రాజకీయాల్లో ఆలోచన ముఖ్యమని లేకపోతే ప్రత్యర్థి పార్టీల ట్రాప్‌లో పడిపోతారన్న భావన వారిలో కనిపిస్తోంది. అయితే కేటీఆర్‌కు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు.