హైదరాబాద్ వినాయక చవితి ఉత్సవాలంటే అందరికీ గుర్తుకు వచ్చేది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాటనే. లక్షలకు లక్షలు పెట్టి భక్తులు దాన్ని వేలం పాటలో దక్కించుకుంటూ ఉంటారు. హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ పుంజుకున్న తర్వాత ఆ వేలం సెంటిమెంట్‌గా మారిపోయింది. ఇప్పుడు ఏపీ నుంచి కూడా వచ్చి ఆ లడ్డూను వేలం పాటలో గెల్చుకునితీసుకుపోతున్నారు. ఈ సారి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ లడ్డూ లభించింది. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ .. తన రియల్ ఎస్టేట్ వ్యాపార భాగస్వామి అయిన మర్రి శశాంక్ రెడ్డితో కలిసి వేలం పాటలో పాల్గొన్నారు.
రూ. 18.90 లక్షలకు దక్కించుకున్నారు. ఇది అత్యధిక ధర. గత ఏడాది రూ.17.60 లక్షలకు రాంరెడ్డి అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు. మామూలుగా అయితే వినాయకచవితి వేలం పాటల్లో లడ్డూ పాడుకున్న వారు తర్వాతి ఏడాది పండుగ సమయానికి చెల్లించాలి. కానీ బాలాపూర్ వాసులు అయితేనే అలా అవకాశం ఇస్తున్నారు. బయట వాళ్లయితే తక్షణం చెల్లించాలనే నిబంధన పెట్టారు.
అందుకే లడ్డూను వేలం పాటలో దక్కించుకున్న వెంటనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ రూ. 18.90 లక్షలను బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి చెల్లించి లడ్డూను తీసుకెళ్లారు. ఏపీ సీఎం జగన్‌కు కానుకగా ఇచ్చేందుకే వేలం పాటలో పాల్గొన్నానని ఎమ్మెల్సీ ప్రకటించారు. కడప జిల్లాకు చెందిన ఆయనకు ఇటీవలే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు